ఐపీవో నిబంధనలు కఠినతరం

1 Oct, 2022 06:27 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌

ఆఫర్‌ డాక్యుమెంట్ల ’ప్రీ–ఫైలింగ్‌’ విధానానికి ఓకే

‘ఇన్‌సైడర్‌’ పరిధిలోకి ఫండ్‌ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలు

ముంబై: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో) నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏ అంశాల ప్రాతిపదికన ఆఫర్‌ ధరను నిర్ణయించారన్న వివరాలను ఆఫర్‌ డాక్యుమెంట్, ప్రైస్‌ బ్యాండ్‌ ప్రకటనల్లో ’ఇష్యూ ధరకు ప్రాతిపదిక’ సెక్షన్‌ కింద వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్యూయర్లు ఇందుకోసం గతంలో జరిపిన నిధుల సమీకరణ, లావాదేవీలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వాటితో పాటు కీలక పనితీరు సూచికలను (కేపీఐ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వివిధ సెక్షన్ల కింద ఇస్తున్నా.. ఆఫర్‌ డాక్యుమెంట్లలోని ఆర్థిక వివరాల సెక్షన్లలో ఉండటం లేదు.

ఎటువంటి ట్రాక్‌ రికార్డు లేని కొత్త తరం కంపెనీలు పెద్ద యెత్తున ఐపీవోలకు వస్తుండటం, ఇన్వెస్టర్లు నష్టపోతుండటం జరుగుతున్న నేపథ్యంలో సెబీ శుక్రవారం బోర్డు సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడగలదని సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ పేర్కొన్నారు.  అలాగే ఐపీవో యోచనలో ఉన్న కంపెనీలు ఆఫర్‌ డాక్యుమెంట్లను ’ప్రీ–ఫైలింగ్‌’ చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఇష్యూకి వచ్చే సంస్థలు తమ ఆఫర్‌ పత్రాలను బహిరంగ పర్చకుండా, ప్రాథమిక సమీక్ష కోసం సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజీలకు అందించాల్సి ఉంటుంది. ప్రీ–ఫైలింగ్‌తో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాసెసింగ్‌ విధానం కూడా ఇకపైనా కొనసాగుతుంది.  

మరిన్ని నిర్ణయాలు..
► మ్యుచువల్‌ ఫండ్‌ యూనిట్ల కొనుగోలు, విక్రయాలను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనల పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ప్రస్తుతం ఈ నిబంధనలు లిస్టెడ్‌ కంపెనీలు లేదా లిస్ట్‌ కాబోతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నాయి.  
► మ్యుచువల్‌ ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లావాదేవీలకు కూడా రెండంచెల ధృవీకరణను సెబీ తప్పనిస రి చేసింది. ఇది 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ల విక్రయ సమయంలో ఆన్‌లైన్‌ లావాదేవీలకు టూ–ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ను, ఆఫ్‌లైన్‌ లావాదేవీలకు సంతకం విధానాన్ని అనుసరిస్తున్నారు.
► ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విషయంలో నాన్‌–ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు సంబంధించి కనీస షేర్‌హోల్డింగ్‌ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కనీసం 10 శాతం వాటా, కనిష్టంగా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్న పక్షంలోనే నాన్‌–ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనే వీలుంటోంది.  
► పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులు, షేర్ల నిర్వహణకు సంబంధించి వివిధ టీమ్‌లు పోషించే పాత్రలు, బాధ్యతలు అలాగే రిస్కు నిర్వహణ విధానాలు మొదలైనవి రాతపూర్వకంగా ఉంచాలి.
► స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు, తొలగింపునకు కొత్త నిబంధనలను సెబీ ఆమోదించింది. వీటి ప్రకారం నియామకం లేదా తొలగింపునకు సాధారణ తీర్మానం, మైనారిటీ షేర్‌హోల్డర్ల మెజారిటీ తీర్మానం అంటూ రెండు పరామితులు ఉంటాయి.
► ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఓపెన్‌ ఆఫర్‌ ధర లెక్కింపు విధానంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం రేటును లెక్కించేందుకు గత 60 ట్రేడింగ్‌ రోజుల వాల్యూమ్‌ వెయిటెడ్‌            సగటు మార్కెట్‌ రేటు (వీడబ్ల్యూఏఎంపీ)ను                 ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు.
► క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు.. పరిశ్రమల వర్గీకరణ కోసం ప్రామాణిక విధానాన్ని పాటించాలన్న ఆదేశాల అమలుకు డెడ్‌లైన్‌ను సెబీ రెండు నెలల పాటు నవంబర్‌ 30 వరకూ వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు