india inc: చైర్మన్, ఎండీ బాధ్యతల విభజన స్వచ్ఛందమే!

16 Feb, 2022 09:28 IST|Sakshi

లిస్టెడ్‌ కంపెనీల్లో ‘తప్పనిసరి’ నిబంధన సవరణ

సెబీ బోర్డ్‌ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల్లో చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) స్థానాలను వేరు చేయడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదని మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ తాజాగా వివరించింది. ఈ మేరకు 2018 మేలో జారీ చేసిన ఆదేశాలను సరళతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో భారత కంపెనీల అభిప్రాయాలను రెగ్యులేటర్‌ తెలుసుకోవాలని, అయితే దీనిని ‘ఆదేశంగా’ భావించవద్దని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన సూచనల నేపథ్యంలో సెబీ బోర్డ్‌ తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతక్రితం సెబీ ప్రకటించిన నిబంధనల ప్రకారం,  దేశంలో టాప్‌ 500 లిస్టెడ్‌ కంపెనీలు 2022 ఏప్రిల్‌లోపు చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌/చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పదవీ బాధ్యతలను విభజించాల్సి ఉంది. అవసరమైతే ప్రత్యేక అనుమతితో రెండేళ్లు సమయం తీసుకోవచ్చు.   

తగిన ఏకాభిప్రాయం రాలేదు 
ఈ విషయంలో ఇప్పటివరకూ తగిన స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోమవారం నాడు సమావేశమైన బోర్డ్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. టాప్‌ 600 లిస్టెడ్‌ కంపెనీ ఏకాభిప్రాయ ‘సమ్మతి’ 2019 సెప్టెంబర్‌లో 50.4 శాతం ఉంటే, 2021 డిసెంబర్‌ 31 నాటికి ఇది కేవలం 54 శాతానికి చేరినట్లు పేర్కొంది. కంపెనీల అగ్ర స్థానంలో అధికారాల విభజన వల్ల నిర్వహణా సామర్థ్యం, పర్యవేక్షణ మెరుగుపడుతుందని సెబీ నియమించిన ఉదయ్‌ కోటక్‌ నేతృత్వంలోని కమిటీ సూచనలు చేసింది. దీని ప్రాతిపదికనే 2018 మేలో సెబీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తుది గడువకు మరో రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  

ఏఐఎఫ్‌ నిబంధనలకు సవరణ 
ఇదిలాఉండగా, మార్కెట్‌  రెగ్యులేటర్‌ సెబీ బోర్డ్‌ మంగళవారం ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) నిబంధనల సవరణలను ఆమోదించింది. సెక్యూరిటీ, క్రెడిట్‌ రేటింగ్‌ల బహిర్గతం చేయడంసహా పలు అంశాలను రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లోనికి తీసుకువచ్చింది. ఒక ఇన్వెస్టీ కంపెనీకి చెందిన లిస్టెడ్‌ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మూడవ కేటగిరీ ఏఐఎఫ్‌లకు వెసులుబాటు కల్పిస్తూనే, ఇందుకు కొన్ని షరతులకు లోబడాల్సి ఉంటుందని బోర్డ్‌ స్పష్టం చేసింది.  .

కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన 
వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా మరిన్ని కొత్త తరం సంస్కరణలను ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలతో మార్కెట్లలో ఏవైనా ఒడిదుడుకులు తలెత్తితే సరి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా సెబీ బోర్డుతో సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

సెబీ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రశంసించిన నిర్మలా సీతారామన్‌..  నిబంధనల భారాన్ని తగ్గించేందుకు, ఇన్వెస్టర్లకు పటిష్టంగా రక్షణ కల్పించేందుకు మరిన్ని చర్యలు అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌కు తోడ్పాటు ఇవ్వాలని, ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్‌)పరమైన పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్‌ బాండ్‌ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. కీలకమైన ధోరణులు, భారత సెక్యూరిటీల మార్కెట్లపై అంచనాలు, వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం తదితర అంశాల గురించి ఆర్థిక మంత్రికి సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వివరించారు. ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్, సెబీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.    

చదవండి: ద్రవ్యోల్బణం పెరిగినా... వడ్డీరేట్లు పెరగవు

మరిన్ని వార్తలు