ఎఫ్‌పీఐలకు కఠిన నిబంధనలు

18 Mar, 2023 01:02 IST|Sakshi

సమాచార వెల్లడిపై సెబీ తాజా చర్యలు

న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీలు) నిబంధనలను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్‌పీఐల నిర్మాణం(స్ట్రక్చర్‌), యాజమాన్యం(కామన్‌ ఓనర్‌షిప్‌) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్‌కాదలచిన ఎఫ్‌పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది.

వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్‌ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్‌పీఐ లేదా ఇన్వెస్టర్‌ గ్రూప్‌ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్‌ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది.

మరిన్ని వార్తలు