మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబీ నూతన మార్గదర్శకాలు

13 Apr, 2021 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) సంస్థలు తమ ట్రస్టీలకు.. అలాగే నియంత్రణ సంస్థ సెబీకి, అదే విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రస్టీలు సెబీకి సమర్పించాల్సిన వివరాల నమూనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శక సూత్రాలను సెబీ సోమవారం విడుదల చేసింది. ఏఎంసీలు రెండు నెలలకోసారి, అరు నెలలకోసారి సెబీకి సమర్పించాల్సిన కాంప్లియన్స్‌ సర్టిఫికెట్‌ (నిబంధనల అమలు వివరాలు)ను నిలిపివేసింది.

రెండు నెలలకు ఓసారి, ఆరు నెలలకు ఓసారి సమర్పించే వివరాలను సైతం ఇక మీదట త్రైమాసిక నివేదికలో పొందుపరచాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. త్రైమాసిక నివేదికలో.. అమల్లో ఉన్న పథకాలు, కొత్తగా ఆవిష్కరించిన పథకాలు, తాజాగా గడువు తీరిన పథకాలు, మూసివేసిన లేదా విలీనం చేసిన పథకాల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవేనీ మూసివేసిన పథకాలు ఉంటే.. వాటికి సంబంధించి చేసిన చెల్లింపులను ప్రతీ త్రైమాసిక నివేదికలో పేర్కొనాలి. ప్రతీ త్రైమాసికం ముగిసిన అనంతరం 21 రోజుల్లోగా వివరాలతో నివేదికలను సమర్పించాలని సెబీ నిర్దేశించింది.  

చదవండి: స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సెబీ బూస్ట్‌

మరిన్ని వార్తలు