వదంతులను నమ్మొద్దు: సెబీ

24 Nov, 2021 07:58 IST|Sakshi

రూమర్ల ఆధారిత పెట్టుబడులు సరికాదు 

రిటైల్‌ ఇన్వెస్టర్లకు అజయ్‌ త్యాగి సూచన  

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో కొద్ది నెలలుగా రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్న నేపథ్యంలో క్యాపిటల్‌ మార్కెట్ల సంస్థ సెబీ అప్రమత్తమైంది. వదంతుల ఆధారంగా పెట్టుబడులకు దిగవద్దంటూ సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించారు. లావాదేవీలను రిజిస్టరైన ఇంటర్మీడియరీల ద్వారా మాత్రమే నిర్వహించవలసిందిగా సూచించారు.

కోవిడ్‌–19 మహమ్మారి తదుపరి దేశీ సెక్యూరిటీల మార్కెట్‌ భారీ వృద్ధిలో సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) ఊపందుకోవడంతోపాటు.. డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు భారీగా పెరిగాయి. వీటికి జతగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సైతం రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అత్యధిక స్థాయిలో ప్రవహిస్తున్నట్లు అజయ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్కెట్లలో పెట్టుబడులు చేపట్టేముందు తగినంత పరిశోధన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రధానంగా మార్కెట్లో పుట్టే వదంతుల ఆధారంగా లావాదేవీలు చేపట్టవద్దంటూ 2021 ప్రపంచ ఇన్వెస్టర్ల వారం(డబ్ల్యూఐడబ్ల్యూ)పై నిర్వహించిన సదస్సు సందర్భంగా అజయ్‌ సూచించారు. ఈ ప్రపంచ సదస్సును అంతర్జాతీయ సెక్యూరిటీల మార్కెట్‌ కమిషన్‌ ఈ ఏడాది నవంబర్‌ 22–28 మధ్య నిర్వహిస్తోంది.  
 

మరిన్ని వార్తలు