ఫండ్స్‌ లావాదేవీలకూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనల వర్తింపు!

9 Jul, 2022 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం లిస్టయిన, లిస్ట్‌ కాబోతున్న షేర్లకు మాత్రమే పరిమితమైన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్స్‌ లావాదేవీలకు కూడా వర్తింపచేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. తద్వారా ధరపై ప్రభావం చూపే కీలక సమాచారం (యూపీఎస్‌ఐ) కలిగి ఉన్న ఫండ్స్‌ సిబ్బంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది.

నిర్దిష్ట స్కీమునకు సంబంధించి, బైటికి ఇంకా వెల్లడించని యూపీఎస్‌ఐ సమాచారం గల ఒక మ్యూచువల్‌ ఫండ్‌ రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంటు..యూనిట్లన్నీ విక్రయించేసుకుని లాభపడటం, అదే విధంగా మరో ఫండ్‌ ఏజెన్సీలోనూ జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ ఈ మేరకు ప్రతిపాదన చేసింది

ఇందుకు సంబంధించిన చర్చాపత్రం ప్రకారం ఫండ్‌ యూనిట్లకు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను వర్తింపచేసేలా సెక్యూరిటీస్, ట్రేడింగ్, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిర్వచనాలను సవరించాలని ప్రతిపాదించింది. అలాగే, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో నిర్దిష్ట స్థాయి వ్యక్తులు తమకు, తమ సమీప బంధువులకు సదరు సంస్థ స్కీముల్లో ఉన్న యూనిట్ల వివరాలను సెబీ నిర్దేశించిన తేదీన బహిర్గతం చేయాలి. ఆ తర్వాత నుంచి మూడు నెలలకోసారి వెల్లడించాలి.   

6 గంటల్లోగా రిపోర్ట్‌ చేయాలి 
సైబర్‌ దాడులను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం ఇవ్వవలసి ఉందని ఇష్యూలను చేపట్టే అర్హతగల రిజిస్ట్రార్లు, షేర్ల బదిలీ ఏజెంట్లు(క్యూఆర్‌టీలు), కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీ(కేఆర్‌ఏ)లకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దాడులు, బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘన తదితర అన్ని రకాల సైబర్‌ ఘటనలను గుర్తించిన వెంటనే సమయానుగుణంగా దేశీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ–ఇన్‌)కు సైతం రిపోర్ట్‌ చేయవలసిందిగా తెలియజేసింది. ఇందుకు మార్గదర్శకాలను ప్రకటిస్తూ రెండు ప్రత్యేక సర్క్యులర్‌లను జారీ చేసింది. వీటిలో భాగంగా జాతీయ కీలక సమాచార మౌలిక రక్షణ కేంద్రం(ఎన్‌సీఐఐపీసీ) ద్వారా ‘రక్షణాత్మక వ్యవస్థ’గా గుర్తింపును సైతం పొందవలసి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్‌సీఐఐపీసీకి సైతం సైబర్‌ సంఘటనలపై సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుందని సెబీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు