స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సెబీ బూస్ట్‌

26 Mar, 2021 14:48 IST|Sakshi

లిస్టెడ్‌ కంపెనీల డీలిస్టింగ్‌ నిబంధనల సవరణ 

ప్రమోటర్లు, సంస్థల మార్గదర్శకాల క్రమబదీ్ధకరణ 

2022-23 నుంచి బీఆర్‌ఎస్‌ఎస్‌ అమలు తప్పనిసరి 

సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు 

న్యూఢిల్లీ: స్టార్టప్‌ల లిస్టింగ్‌ను ప్రోత్సహించే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొన్ని నిబంధనలను సరళీకరించింది. 25 శాతం ప్రీ ఇష్యూ క్యాపిటల్‌ హోల్డింగ్‌ సమయాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించడం తదితర సవరణలను చేపట్టింది. అంతేకాకుండా అర్హతగల ఇన్వెస్టర్లకు విచక్షణాధికార కేటాయింపునకు సైతం అనుమతించనుంది. 30 రోజుల లాకిన్‌ గడువుతో ఇష్యూ పరిమాణంలో 60 శాతం వరకూ షేర్లను కేటాయించవచ్చు. ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా స్టార్టప్‌ల లిస్టింగ్‌కు వీలు కల్పించనుంది. గురువారం (మార్చి 25) జరిగిన బోర్డు సమావేశంలో సెబీ ఇంకా లిస్టెడ్‌ కంపెనీలు, ప్రమోటర్లు, ఆర్థిక ఫలితాలు తదితర అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర వివరాలివీ.. 

1,000 కంపెనీలకు.. 
ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలను నిర్ధారించడంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సెబీ క్రమబద్దీకరించింది. ఇక లిస్టెడ్‌ కంపెనీలు నిర్వహణ సంబంధ(సస్టెయినబిలిటీ) నివేదికలను రూపొందించడంలో కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుత బీఆర్‌ఆర్‌ స్థానే వ్యాపార బాధ్యతలు, నిర్వహణ సంబంధ నివేదిక (బీఆర్‌ఎస్‌ఆర్‌) పేరుతో తాజా నిబంధనలు రూపొందించింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్ ‌(విలువ) రీత్యా టాప్‌-1,000 లిస్టెడ్‌ కంపెనీలకు తాజా బీఆర్‌ఎస్‌ఆర్‌ నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్వచ్చందంగా పాటించేందుకు వీలుంది. అయితే 2022-23 ఏడాది నుంచి తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలి. డివిడెండ్‌ పంపిణీ విధానాల అమలులో ప్రస్తుతమున్న టాప్‌-500 లిస్టెడ్‌ కంపెనీల జాబితాను తాజాగా టాప్‌–1,000కు సవరించింది.  

24 గంటల్లోగా 
లిస్టెడ్‌ కంపెనీలు విశ్లేషకులు, ఇన్వెస్టర్ల సమావేశాలను నిర్వహించినప్పడు ఈ ఆడియో, వీడియో వివరాలను 24 గంటల్లోగా(తదుపరి ట్రేడింగ్‌ రోజు) తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సైతం అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరి్థక ఫలితాలు ప్రకటించిన ఐదు పని దినాలలోగా వెబ్‌సైట్లు, స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సమాచారాన్ని చేరవేయవలసి ఉంటుంది. రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించిన పక్షంలో ఆర్థిక ఫలితాలను 30 నిమిషాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల ఫిర్యాదులు, కార్పొరేట్‌ పాలన, వాటాదారుల వివరాలు వంటి అంశాలను ప్రతి క్వార్టర్‌ తదుపరి 21 రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. కంపెనీలో మెజారిటీ వాటాలను విక్రయించాక ప్రమోటర్లు నామమాత్ర వాటాలను మాత్రమే కలిగి ఉండి, యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు పబ్లిక్‌ వాటాదారుగా గుర్తించే అంశంలోనూ నిబంధనలను సవరించింది.  

డీలిస్టింగ్‌ వెనుక ఉద్దేశ్యం చెప్పాల్సిందే 
మార్కెట్ల నుంచి కంపెనీల డీలిస్టింగ్‌ను మరింత పారదర్శకంగా మార్చాలని సెబీ నిర్ణయించింది. ఇందుకోసం డీలిస్టింగ్‌ ప్రకటన చేసే ప్రమోటర్లు/కొనుగోలుదారులు తమ ఉద్దేశ్యాన్ని వెల్లడించేలా చేయాలని సెబీ నిర్ణయించింది. అలాగే, వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడుల నిర్వచనం కింద నిషేధిత కార్యకలాపాలు లేదా రంగాల జాబితాను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) కింద నమోదైన వెంచర్‌క్యాపిటల్‌ ఫండ్స్‌కు వెసులుబాటు రానుంది. డీలిస్టింగ్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ఇందుకు సంబంధించి నిబంధనల సవరణకు బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ గురువారం ప్రకటించింది. నూతన నిబంధనల కింద ప్రతిపాదిత డీలిస్టింగ్‌కు సంబంధించి ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు తమ సిఫారసులు తెలియజేయాల్సి ఉంటుంది.

చదవండి:

సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం

ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్​అలర్ట్!

మరిన్ని వార్తలు