రాయల్‌ ట్వింకిల్, సిట్రస్‌ ఆస్తుల వేలం

20 Jun, 2022 05:48 IST|Sakshi

సెబీ తాజా నిర్ణయం

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. రాయల్‌ ట్వింకిల్‌ స్టార్‌ క్లబ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్, సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌ లిమిటెడ్‌కు చెందిన 39 ఆస్తుల(ప్రాపర్టీలు)ను జులై 15న వేలం వేయనుంది. ఇందుకు రూ. 66.51 కోట్లను రిజర్వ్‌ ధరగా నిర్ణయించింది. అక్రమంగా వేల కోట్ల నిధులను సమీకరించిన ఈ కంపెనీల నుంచి సొమ్మును రికవర్‌ చేసేందుకు వేలాన్ని చేపడుతోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకూ వేలాన్ని నిర్వహించనున్నట్లు సెబీ నోటీసులో తెలియజేసింది. వేలంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డామన్, దాద్రా నగర్‌ హవేలీలలోగల ఆఫీస్‌ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు, భూములు, భవనాలు తదితర ఆస్తులను విక్రయించనుంది.

2019 నవంబర్‌ నుంచి 2022 మార్చి మధ్యలో 266 ప్రాపర్టీలను రూ. 1,297 కోట్ల రిజర్వ్‌ ధరలో వేలం వేసింది. సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌ ద్వారా కలెక్టివ్‌ పెట్టుబడి పథకాల(సీఐఎస్‌)ను చేపట్టిన రాయల్‌ ట్వింకిల్‌ డైరెక్టర్లు, సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌కు సెబీ 2018 డిసెంబర్‌లో రూ. 50 లక్షల జరిమానా విధించింది. కాగా.. 2019 డిసెంబర్‌లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలమేరకు ఆరు నెలల్లో 114 ప్రాపర్టీల విక్రయానికి సెబీ చర్యలు చేపట్టింది. టైమ్‌షేర్‌ హాలిడే పథకాలపేరిట రూ. 2,656 కోట్లకుపైగా అక్రమంగా సమీకరించడంతో 2015 ఆగస్ట్‌లో రాయల్‌ ట్వింకిల్, దాని నలుగురు డైరెక్టర్లపై సెబీ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది.

మరిన్ని వార్తలు