సోషల్‌ మీడియాపై సెబీ దృష్టి

15 Nov, 2022 04:55 IST|Sakshi

వెబ్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ ఏర్పాటుకు 4 బిడ్డర్ల ఎంపిక

న్యూఢిల్లీ: మార్కెట్‌ మోసాలను అరికట్టే దిశగా సోషల్‌ మీడియా, ఇతరత్రా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘వెబ్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌‘ను ఏర్పాటు చేసేందుకు నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఆమ్‌ట్రాక్‌ టెక్నాలజీస్, ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్, పెలోరస్‌ టెక్నాలజీస్, ల్యాబ్‌ సిస్టమ్స్‌ వీటిలో ఉన్నట్లు సెబీ తెలిపింది.

ఇంటర్నెట్‌లో విస్తృతంగా ఉండే సమాచారం ఆధారంగా వివిధ సంస్థలు, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించడం, ఎప్పటికప్పుడు రిపోర్టులు రూపొందించడం మొదలైన విధులు ఈ టూల్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగిపోయి, బోలెడంత సమాచారం అందుబాటులో ఉంటోంది. వివిధ సంస్థలు, వ్యక్తులు, గ్రూప్‌లు, అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని సెబీ భావిస్తోంది. విచారణ ప్రక్రియ సులభతరం కాగలదని, సమయం కూడా ఆదా అవుతుందనే ఉద్దేశంతో కొత్త వెబ్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ని ఉపయోగించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు