ఐసీఈఎక్స్‌పై సెబీ కొరడా!

11 May, 2022 11:20 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇండియన్‌ కమోడిటీ ఎక్సే్ంజీ(ఐసీఈఎక్స్‌) లిమిటెడ్‌ గుర్తింపును రద్దు చేసింది. ఎక్సేంజీకి తగిన ఆర్థిక దన్ను లోపించడంతోపాటు.. అవసరమైనమేర సామర్థ్యం కలిగిన సిబ్బంది లేకపోవడంతో గుర్తింపు రద్దుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐసీఈఎక్స్‌ గుర్తింపు కలిగిన ఎక్సేంజీ హోదాను నిలిపివేసినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా 2009 అక్టోబర్‌లో శాశ్వత ప్రాతిపదికన ఫార్వార్డ్‌ కాంట్రాక్టులకింద ఐసీఈఎక్స్‌ గుర్తింపు కలిగిన ఎక్సేంజీ ఆవిర్భవించింది. అయితే ఇటీవల నెట్‌వర్త్, మౌలిక సదుపాయాలు తదితర పలు అంశాలలో ఐసీఈఎక్స్‌ నిబంధనలను అందుకోకపోవడంతో పరిశీలనల అనంతరం సెబీ గుర్తింపును రద్దు చేసింది.

2021 నవంబర్‌లో రూ. 93.43 కోట్లకు చేరిన ఐసీఈఎక్స్‌ నెట్‌వర్త్‌ 2022 జనవరికల్లా రూ. 86.45 కోట్లకు తగ్గినట్లు సెబీ పేర్కొంది. నిబంధనల ప్రకారం గుర్తింపు కలిగిన ఎక్సేంజీ అన్ని కాలాల్లోనూ కనీసం రూ. 100 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి.ఎక్సేంజీలో కాంట్రాక్టులు సైతం చెప్పుకోదగిన పరిమాణంలో నమోదుకావడంలేదని సెబీ తెలియజేసింది. 
చదవండి: మిస్టర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే?

మరిన్ని వార్తలు