టాటా మోటార్స్‌కు సెబీ హెచ్చరిక!

10 Jun, 2022 14:33 IST|Sakshi

18ఏళ్ల క్రితం కేసులో ఇకపై కామెంట్స్‌

జాగ్రత్త వహించవలసిందిగా సూచన 

నిశ్కల్ప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌కూ తాజా ఆదేశాలు  

న్యూఢిల్లీ: సెక్యూరిటీల మార్కెట్లో భవిష్యత్‌ లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్చరించింది. 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రస్తుతం కఠిన ఆదేశాలు జారీ చేయడంవల్ల వాస్తవికంగా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించింది. ఇదేవిధంగా నిశ్కల్ప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌(గతంలో నిశ్కల్ప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌)ను సైతం భవిష్యత్‌ లావాదేవీల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించవలసిందిగా ఆదేశించింది. 

వెనక తేదీతో గ్లోబల్‌ టెలి సిస్టమ్స్‌ (ప్రస్తుతం జీటీఎల్‌ లిమిటెడ్‌), గ్లోబల్‌ ఈకామర్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (2001లో ఈ అన్‌లిస్టెడ్‌ సంస్థ జీటీఎల్‌లో విలీనమైంది)లో నిర్వహించిన షేర్ల లావాదేవీలకు సంబంధించిన కేసు విషయంలో సెబీ తాజాగా స్పందించింది. ఈ కేసు విషయంలో ప్రస్తుతం చర్యలు తీసుకోవడం చట్టపరంగా సమంజసమే అయినప్పటికీ వాస్తవంగా ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని అభిప్రాయపడింది. రైట్స్‌ ఇష్యూ నిర్వహించిన టాటా ఫైనాన్స్‌ 17 ఏళ్ల క్రితం అంటే 2005 జూన్‌ 24న టాటా మోటార్స్‌లో విలీనమైనట్లు సెబీ పేర్కొంది. ప్రస్తుతం మనుగడలోలేదని సెబీ హోల్‌టైమ్‌ సభ్యులు ఎస్‌కే మొహంతీ 54 పేజీల ఆదేశాలలో వివరించారు. ప్రస్తుత టాటా మోటార్స్‌ బోర్డు డైరెక్టర్లకూ, అప్పటి టాటా ఫైనాన్స్‌ డైరెక్టర్లకూ ఎలాంటి సంబంధంలేదని తెలియజేశారు. వీరంతా సీనియర్‌ సిటిజన్లని, చాలా కాలం క్రితమే టీఎఫ్‌ఎల్, నిశ్కల్ప్‌ బోర్డుల నుంచి పదవీ విరమణ చేశారని ప్రస్తావించారు.  

చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
 

మరిన్ని వార్తలు