Sebi: రూ. 60,000 కోట్ల మోసం.. ఆ సంస్థ ఆస్తి లావాదేవీలతో జాగ్రత్త: సెబీ వార్నింగ్‌

28 Jul, 2022 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఏసీఎల్‌ గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తుల లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రజలను హెచ్చరించింది. ఆయా ఆస్తుల విక్రయానికి ఎవరికీ అనుమతులు లేవని స్పష్టం చేసింది. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల పేరుతో పీఏసీఎల్‌ (పెర్ల్‌ గ్రూప్‌) ప్రజల నుంచి నిధులు సమీకరించిన సంగతి తెలిసిందే. సెబీ గణాంకాల ప్రకారం గడిచిన 18 ఏళ్లలో సమిష్టి పెట్టుబడుల స్కీముల (సీఐఎస్‌) ద్వారా పీఏసీఎల్‌ మోసపూరితంగా రూ. 60,000 కోట్లు సమీకరించింది.

వీటిని ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వాలన్న ఆదేశాలను పాటించనందుకు గాను కంపెనీ, దాని తొమ్మిది మంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు 2015లో సెబీ ఆదేశాలు ఇచ్చింది. ప్రాపర్టీల విక్రయం, రిఫండుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2016లో సుప్రీం కోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎం లోధా సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే దశలవారీగా రిఫండు ప్రక్రియ ప్రారంభించింది. అయితే, కర్ణాటకలోని పీఏసీఎల్‌ ఆస్తులను విక్రయించేందుకు హర్విందర్‌ సింగ్‌ భంగూ అనే వ్యక్తికి కమిటీ నోడల్‌ అధికారి అనుమతులు ఇచ్చారంటూ నకిలీ లేఖ ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో కమిటీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 

సోషల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీకి మార్గదర్శకాలు
క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సోషల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీ(ఎస్‌ఎస్‌ఈ) మార్గదర్శకాలను నోటిఫై చేసింది. తద్వారా నిధుల సమీకరణలో సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అదనపు అవకాశాలు ఏర్పడనున్నాయి. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్, టెక్నికల్‌ గ్రూప్‌ చేసిన సిఫారసుల ఆధారంగా సెబీ మార్గదర్శకాలను రూపొందించింది. దేశీయంగా ఎస్‌ఎస్‌ఈ అనేది కొత్త ప్రతిపాదనకాగా.. ప్రయివేట్, నాన్‌ప్రాఫిట్‌ రంగాలకు భారీగా నిధులు లభించేందుకు వీలుంటుంది. ఎస్‌ఎస్‌ఈ ఆలోచనను 2019–20 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి వెల్లడించారు.

తాజా మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఎస్‌ఈ.. ప్రస్తుత స్టాక్‌ ఎక్స్‌చేంజీల నుంచి ప్రత్యేక విభాగంగా ఏర్పాటుకానుంది. ఇందుకు సెబీ నోటిఫికేషన్స్‌ను జారీ చేసింది. ఎస్‌ఎస్‌ఈలో లిస్టయ్యేందుకు నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్స్‌(ఎన్‌పీవోలు)సహా సామాజిక లక్ష్యాలుగల సంస్థలకు అవకాశముంటుంది. సెబీ ధృవీకరించిన 16 రకాల బోర్డు కార్యకలాపాలలో భాగమైన సంస్థలకు ఎక్సే్ఛంజీలో పార్టిసిపేట్‌ చేసేందుకు అనుమతిస్తారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య పరిరక్షణకు ప్రోత్సాహం, విద్యకు మద్దతు, ఉపాధి కల్పన, పోషకాహారం, సమానత్వానికి ప్రాధాన్యం వంటి కార్యకలాపాలను సెబీ లిస్ట్‌ చేసింది. 

చదవండి: America Federal Reserve Bank: ప్చ్‌.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్‌!

మరిన్ని వార్తలు