సహారా ఇన్వెస్టర్లకు చెల్లించింది రూ.129 కోట్లు

9 Aug, 2021 00:59 IST|Sakshi

సెబీ వద్ద రూ.23,000 కోట్లు

న్యూఢిల్లీ: నిధులున్నాయి. కానీ, వీటి తాలూకూ ఇన్వెస్టర్లే కనిపించడం లేదు..! సహారా కేసు వ్యవహారంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇది. సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించిన కేసులో ఇన్వెస్టర్లకు సెబీ ఇప్పటి వరకు కేవలం రూ.129 కోట్లే చెల్లించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాతాలో సహారా గ్రూపునకు సంబంధించి నిధులు రూ.23,191 కోట్లు ఉండడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలతో చెల్లింపుల బాధ్యతను సెబీ చూస్తున్న విషయం తెలిసిందే.

రెండు సహారా గ్రూపు కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారిలో అత్యధికుల నుంచి క్లెయిమ్‌లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు కంపెనీలకు సంబంధించి 3 కోట్ల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయాలని సుప్రీంకోర్టు 2012 ఆగస్ట్‌లోనే ఆదేశించింది. సెబీ తాజా వార్షిక నివేదికను పరిశీలిస్తే.. 2021 మార్చి 31 నాటికి ఇన్వెస్టర్ల నుంచి 19,616 దరఖాస్తులే వచ్చాయి. ఇందులో 16,909 దరఖాస్తులను పరిష్కరించింది. రూ.129 కోట్లను చెల్లించింది. చిరునామాల్లో తేడాలున్నాయంటూ 483 దరఖాస్తులను వెనక్కి పంపింది. 332 దరఖాస్తులు సహారా వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు