కరోనా సెకండ్‌వేవ్‌: ఎకానమీ కష్టాలు!

14 Apr, 2021 13:53 IST|Sakshi

2021లో రెండంకెల్లో వృద్ధి ఉన్నా... అది ‘బేస్‌’ పుణ్యమేనన్న మూడీస్‌

ఉత్పత్తిపై ప్రభావం తప్పదని సీఐఐ సర్వే వెల్లడి

జూన్‌ త్రైమాసికంలో జీడీపీకి  1.4 శాతం నష్టమని బార్ల్కేస్‌‌ అంచనా 

సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్‌  సెకండ్‌వేవ్‌ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్‌ తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, బ్రోకరేజ్‌ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2021లో రెండంకెల్లో వృద్ధి రేటు ఉన్నా 2020లో అతి తక్కువ స్థాయి గణాంకాలే(బేస్‌ ఎఫెక్ట్‌) ఇందుకు ప్రధాన కారణమవుతోందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా, పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలువురు సీఈవోలు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు సీఐఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సెకండ్‌వేవ్‌ కేసుల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 1.4 శాతం నష్టం జరగనుందని బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం– బార్ల్కేస్‌ అంచనావేస్తోంది.

కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15- మే 3, మే 4మే 17, మే 18-మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగిన సంగతి తెలిసిందే. సెకండ్‌ వేవ్‌ కరోనా కేసుల తీవ్రత, ధరల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత తత్సంబంధ సవాళ్లు తిరిగి ఎకానమీ రికవరీ వేగంపై అనుమానాలను సృష్టిస్తున్నాయి. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యలో గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో సీఐఐ, మూడీస్, బార్ల్కేస్‌ అంచనాలను వేర్వేరుగా పరిశీలిస్తే..  (దేశవ్యాప్త లాక్‌డౌన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు)

ఆర్థికాభివృద్ధి బాటలో అవరోధమే: మూడీస్‌

► భారత్‌ వృద్ధి సానుకూల అంచనాలకు కోవిడ్‌–19 తాజా కేసులు సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతకు సెకండ్‌వేవ్‌ అవరోధమే. అయినా జీడీపీ 2021లో రెండంకెల్లో వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. దీనికి ప్రధాన కారణం గత ఏడాది అతి తక్కువ స్థాయి (బేస్‌ ఎఫెక్ట్‌) గణాంకాలు కావడమే. 

► 2020లో దేశ వ్యాప్తంగా జరిగిన కఠిన లాక్‌డౌన్‌ తరహా పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకపోవచ్చు. లాక్‌డౌన్‌ కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా మాత్రమే పరిమితమవవచ్చు. దీనివల్ల 2020లో జరిగిన ‘లాక్‌డౌన్‌’ నష్టం తిరిగి 2021లో ఏర్పడదు. 

► ఏప్రిల్‌ 12 వరకూ చూస్తే, భారత్‌ కోవిడ్‌–19 వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,70,179గా ఉంది. భారత్‌లో యువత తక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంది. 

► వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడంసహా కోవిడ్‌–19 కట్టడికి తీసుకునే పలు చర్యలు భారత్‌ను ‘క్రెడిట్‌–నెగటివ్‌’ ప్రభావం నుంచి తప్పిస్తాయి. 

► ఏప్రిల్‌ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2021లో 12 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. అయితే వృద్ధి అంచనాలను తాజా పరిస్థితులు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కేసులు పెరగడం ఆర్థిక క్రియాశీలతను అలాగే కన్జూమర్‌ సెంటిమెంట్‌నూ దెబ్బతీస్తుంది. 

► కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కమోడిటీ ధరల పెరుగుదల డిమాండ్‌కు అవరోధంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులను భారత్‌ ఇప్పటికే ఎదుర్కొంటోంది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్‌ కొంత ఎక్కువగానే ఉంది. 

► దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర సెకండ్‌వేవ్‌కు కేంద్రంగా నిలవడం గమనార్హం. ఏప్రిల్‌ 12 నాటికి యాక్టివ్‌ కేస్‌లోడ్‌లో 50 శాతం ఇక్కడే ఉంది. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు )

వారానికి 1.25 బిలియన్‌ డాలర్ల నష్టం: బార్లే్కస్‌

♦ సెకండ్‌వేవ్‌ తీవ్రత వ్యాపారాలు, రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్‌డౌన్‌ల వల్ల వారానికి ఆర్థిక వ్యవస్థ సగటున 1.25 బిలియన్‌ డాలర్ల (డాలర్‌కు రూ.75 చొప్పున చూస్తే దాదాపు రూ. 9,375 కోట్లు) నష్టం జరుగనుంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో దాదాపు 140 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) నష్టపోతుంది. నియంత్రణలు తక్కువగా ఉన్న వారం రోజుల క్రితం వారానికి ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 0.52 బిలియన్‌ డాలర్లే. 

♦ మే నెల వరకూ ప్రస్తుత ఆంక్షలు కొనసాగితే ఇటు ఆర్థిక వ్యవస్థకు అటు వాణిజ్య కార్యకలాపాలకు రెండింటికీ కలిసి దాదాపు 10.5 బిలియన్‌ డాలర్ల నష్టం జరగనుంది. 

♦ రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్‌ డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

♦ సెకండ్‌వేవ్‌ కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. 

♦ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదవుతుంది. దీనికి బేస్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణం. కాగా కేసులు మరింత తీవ్రతరం కావడం, కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులు తలెత్తితే వృద్ధి రేటు మరింత పడిపోడానికే అవకాశం ఉంది. 

♦ తాజా అంచనాల ప్రకారం, మే నెలాంతానికి కొత్త కేసుల పెరుగుదల సంఖ్యలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్‌ విస్తృతి, మెరుగైన వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పనకు చర్యలు వంటి అంశాలు భారత్‌ సమీప భవిష్యత్‌ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి.

ఉత్పత్తి పతనంపై సీఈవోల ఆందోళన: సీఐఐ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తే ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడుతుందని 75 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. కరోనా.. లాక్‌డౌన్‌ అంశాలపై సీఐఐ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్‌మెంట్, కరోనా నియంత్రణ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వంటివి సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి తీవ్రత చెందకుండా నియంత్రిస్తున్నప్పటికీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలపై మహమ్మారి ప్రభావం పడకుండా చూడాల్సి ఉందని సీఐఐ పేర్కొంది. ఇందుకు తగిన చర్యలు అవసరమని పలు పరిశ్రమల సీఈవోలు అభిప్రాయపడ్డారని తెలిపింది. సీఈవోలు పాక్షిక లాక్‌డౌన్‌ పెడతారని భావిస్తున్నారని, అదే జరిగితే వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, సరకు రవాణాకు అంతరాయం ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. సీఐఐ నిర్వహించిన పోల్‌ సర్వేలో 710 మంది (75శాతం) సీఈవోలు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపింది.

సరకు రవాణాపై నియంత్రణ తీసుకొస్తే తమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని 60శాతం సీఈవోలు తెలిపారని సీఐఐ వెల్లడించింది. సరకు రవాణాకు అనుకూలించే పర్యావరణ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తే ఉత్పత్తి నష్టపోతామని 56 శాతం సీఈవోలు తెలిపారు. ఈ పోల్‌ సర్వేలో 68శాతం ఎంఎస్‌ఎంఈ సీఈవోలతోపాటు తయారీ, సేవల రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమలు ఆరోగ్య, భద్రత ప్రోటోకాల్స్‌ పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయని 96 శాతం సీఈవోలు చెప్పగా... పాక్షిక లాక్‌డౌన్‌ కన్నా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం మంచిదని 93శాతం సీఈవోలు పోల్‌ ద్వారా వెల్లడించారని సీఐఐ పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలు విధించినప్పటికీ కార్మికులను అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలని, సరకు రవాణా ఆగకుండా చూడాలని 60శాతం సీఈవోలు తెలిపారు. ఈ సమయంలో కార్మికులు, పరిశ్రమ సిబ్బంది ఆరోగ, భద్రత ప్రోటోకాల్స్‌ కఠినంగా పాటించేలా చూడాలని వారు తెలిపారు. 

సేఫ్టీ ప్రోటోకాల్స్‌ కఠిన అమలు: టీవీ నరేంద్రన్‌ 
సీఐఐ అధ్యక్షుడు(ఎన్నికైన) టీవీ నరేంద్రన్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమూహాలుగా ఒకే చోట చేరడం, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి తరచూ నిర్వహించే కార్యక్రమాలపైనా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీకా మహోత్సవ్‌లో పరిశ్రమల కార్మికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్లోని 65 కార్యాలయాలను కోరామని తెలిపారు. 

10.5 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు:  గోల్డ్‌మన్‌ శాక్స్‌
భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉండొచ్చని లోగడ వేసిన అంచనాలను తాజాగా 10.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం విధిస్తున్న లాక్‌డౌన్‌లు వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు