రెండేసి ఇళ్లు కొంటున్నారు..!

29 May, 2021 00:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో సెకండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌

హెచ్‌ఎన్‌ఐ, మిలీనియల్స్, ఎన్నారైల ఆసక్త

300 కి.మీ. దూరమైనా సరే గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌ ప్రాపర్టీలకు ఓకే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్‌ హోమ్స్‌ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

ఎవరు కొంటున్నారంటే?
ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్‌ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ తర్వాత సెకండ్‌ హోమ్స్‌ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రితేష్‌ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్‌ హోమ్స్‌ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు.

ఎక్కడ కొంటున్నారంటే?
ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్‌ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్‌ హోమ్స్‌కు   డిమాండ్‌ ఉందని అడ్వైజరీ సర్వీసెస్‌ కొల్లియర్స్‌ ఇండియా ఎండీ శుభంకర్‌ మిత్రా తెలిపారు.

దుబాయ్, యూఏఈలోనూ..
మిలీనియల్స్‌ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్‌ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్‌ రోడ్‌లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్‌ ఉంది. గోవాలోని పలు బీచ్‌ ప్రదేశాలు కూడా హెచ్‌ఎన్‌ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్‌ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్‌ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్‌ హోమ్స్‌ డిమాండ్‌ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.

రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు..
ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్‌ హోమ్స్‌ వృద్ధి 30–40% వరకుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో  రూ.10–100 కోట్ల ఫామ్‌ హౌస్‌లకు డిమాండ్‌ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్‌ హోమ్స్‌ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్‌ఎన్‌ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక, మిలీనియల్స్‌ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్‌ అపార్ట్‌మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్‌ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు