‘బిట్‌కాయిన్‌ కా బాప్‌’ ఎవరు?.. నిజంగా సుడిగాడే! ఓడి వుంటే 2 లక్షల కోట్లకు పిడి పడేదే!

7 Dec, 2021 13:06 IST|Sakshi

Self-Described Bitcoin Creator Must Pay 100 Million Dollars in Suit : బిట్‌కాయిన్‌.. క్రిప్టోకరెన్సీలోకెల్లా అత్యంత విలువైన కరెన్సీ.  2008 నుంచి డిజిటల్‌ మార్కెట్‌లో ఇది చెలామణి అవుతుండగా.. అసలా ఈ కరెన్సీని కనిపెట్టింది ఎవరై ఉంటారనే చర్చ చాలా ఏళ్ల పాటు కొనసాగింది. ఈ లోపు సతోషి నాకామోటో అనే పేరు తెర మీదకు రాగా..  2016లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.


ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌ క్రెయిగ్‌ రైట్‌ ఒరిజినల్‌ సతోషి నాకామోటో తానేనంటూ ఓరోజు తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. బిట్‌కాయిన్‌ను తానే రూపొందించానని, మారు పేరుతో అదంతా చేశానని సంచలన ప్రకటన విడుదల చేశాడు. అయితే క్రిప్టో కమ్యూనిటీ మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదు. ఈ లోపు ఈ వ్యవహారంలో క్రెయిగ్‌కు పెద్ద ఝలకే తగిలింది. బిట్‌ కాయిన్‌ తయారీలో రైట్‌కు కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ డేవిడ్‌ క్లెయిమన్‌(చనిపోయాడు) సహభాగస్వామిగా సాయం చేశాడని, కాబట్టి, హక్కుల కింద రైట్‌(సతోషి నాకామోటో) దగ్గర ఉన్న క్రిప్టో సంపదలో(54 బిలియన్‌ డాలర్ల.. మన కరెన్సీలో దాదాపు 3 లక్షల 80 వేల కోట్లు).. సగం వాటా(దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు) దక్కాలంటూ క్లెయిమన్‌ కుటుంబికులు (ఎస్టేట్‌) కోర్టు గడప తొక్కింది.


క్రెయిగ్‌ రైట్‌
అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు క్రెయిగ్‌కు భారీ ఊరట లభించింది.  తన వ్యాపార భాగస్వామి(మాజీ) కుటుంబానికి బిలియన్ల డాలర్ల కొద్ది క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది.  మియామీ(వెస్ట్‌ పామ్‌ బీచ్‌) కోర్టులో ఈ పిటిషన్‌పై మూడు వారాలపాటు వాదనలు జరగ్గా.. సోమవారం మియామీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరూ కలిసి బిట్‌కాయిన్‌ను రూపొందించినట్లు స్పష్టమైన ఆధారాల్లేవని, రైట్‌ తరపు నుంచి బిట్‌కాయిన్‌ సంపద ఏదీ కూడా క్లెయిమన్‌ ఫ్యామిలీకి చెందాల్సిన అవసరం లేదని తీర్పు వెల్లడించింది. 

డేవిడ్‌ క్లెయిమన్‌ (పాత చిత్రం)

అయితే డబ్ల్యూ అండ్‌ కే ఇన్ఫో డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఎల్‌ఎల్‌సీ కి వ్యవహారాలను క్లెయిమన్‌-రైట్‌లు సంయుక్తంగా(జాయింట్‌ వెంచర్‌) చూసుకున్నారని, ఆ సమయంలో కంపెనీకి చెందిన బిట్‌కాయిన్‌ సంబంధిత సంపదను క్రెయిగ్‌ రైట్‌ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని రుజువైంది. దీంతో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి క్రెయిగ్‌ రైట్‌.. 100 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని(750 కోట్ల రూ. మన కరెన్సీలో) తీర్పు వెల్లడించింది. ఆ డబ్బును క్లెయిమన్‌ ఎస్టేట్‌కు కాకుండా డబ్ల్యూ అండ్‌ కే కు నేరుగా అందించాలని తీర్పు ఇచ్చింది. 


క్రెయిగ్‌ రైట్‌

ఇక ఈ దావా హైప్రొఫైల్‌ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం.. సతోషి నాకామోటో మిస్టరీ. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం సమయంలో సతోషి నాకామోటో పేరుతో తొమ్మిది పేజీలతో కూడిన ఒక శ్వేతపత్రం విడుదలైంది. కొన్ని నెలలకే ఈ క్రిప్టోకరెన్సీ తయారీ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రిలీజ్‌ అయ్యింది.  2011 వరకు బిట్‌కాయిన్‌కి ఏకైక కోడర్‌(కోడింగ్‌ ఇచ్చిన వ్యక్తి) నాకామోటో ఒక్కడే. అయితే ఆ తర్వాత సతోషి అనే పేరు డిజిటల్‌ మార్కెట్‌ నుంచి క్రమంగా కనుమరుగు అయ్యింది. అయితే సతోషి పేరు మీద ఏకంగా 1.1 మిలియన్‌ బిట్‌కాయిన్లు (ఇప్పటి విలువ ప్రకారం.. 54 బిలియన్‌ డాలర్లు.. ) ఉన్నాయి ఇప్పుడు. 

ఈ తరుణంలో ఒకవేళ రైట్‌ గనుక కేసు ఓడిపోయి ఉంటే.. సతోషి పేరు హోదాలో  క్లెయిమన్‌ ఎస్టేట్‌కు భారీగా పరిహారం(27 బిలియన్‌ డాలర్లు.. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి వచ్చేది. కానీ, రైట్‌ సుడి బాగుండి కేసు గెలిచాడు. కాబట్టే బతికిపోయాడు. అంతేకాదు బిట్‌కాయిన్‌ని తానే సృష్టించానని(సతోషి) కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తాను గనుక కేసు గెలిస్తే.. తన దగ్గర ఉన్న బిట్‌కాయిన్‌ సందపతో కొంత ఛారిటీలకు ఇస్తానన్న ప్రకటన కూడా అతనికి అనుకూలంగా తీర్పు రావడానికి ఒక కారణంగా మారింది.

 చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1

మరిన్ని వార్తలు