దేశంలో భారీగా పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ రుణాలు!

19 Aug, 2022 08:13 IST|Sakshi

ముంబై: సూక్ష్మ రుణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారీగా 24 శాతం పెరిగింది. 2021–22 రూ.2,22,307 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో తాజా సమీక్షా కాలంలో రూ.2,75,750 కోట్లకు ఎగసింది.

2022 మార్చి ముగిసే నాటికి అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రూ.2,62,599 కోట్లుగా ఉన్నట్లు మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తింపు కలిగిన– సెల్ప్‌ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌ఆర్‌ఓ) నివేదిక వివరించింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

 బ్యాంకులు మినహా అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకుల మైక్రోక్రెడిట్‌ పోర్ట్‌ఫోలియో మాత్రం 9.23 శాతం పెరిగి రూ.1,04,762 కోట్లకు చేరుకుంది.  

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) విషయంలో మాత్రం భారీగా 54.62 శాతం సూక్ష్మ రుణ వృద్ధి జరిగింది. విలువలో ఇది రూ.24,870 కోట్లు. 

ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) నాట్‌–ఫర్‌–ప్రాఫిట్‌ ఎంఎఫ్‌ఐలు (ఎన్‌ఎఫ్‌పీ) వరుసగా 35.18 శాతం, 27.66 శాతం, 20.71 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 

ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో రుణ సంస్థల మొత్తం రుణ పంపిణీ రూ. 57,842 కోట్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 27,328 కోట్లు.  

కాగా, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2022 జనవరి–మార్చి)తో పోల్చితే ఏప్రిల్‌–జూన్‌ మధ్య రుణ పంపిణీ 35 శాతం పడిపోయింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా రుణదాతలు తమ రుణ పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావడం దీనికి కారణం.  

ఇక 2022 జనవరి–మార్చిలతో పోల్చితే, ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈ రంగంలో రికవరీగా కూడా భారీగా మెరుగుపడింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మెరుగుదల దాదాపు 99 శాతంగా కూడా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎంతో తక్కువగా కూడా ఉంది. ఉదాహరణకు అస్సోంను తీసుకుంటే, రికవరీ రేటు 50 శాతం నుంచి 55 శాతంగా ఉంది.  

ఇక జూన్‌ చివరినాటికి సూక్ష్మ రుణ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) దాదాపు 12 శాతం. ఎన్‌బీఎఫ్‌సీ– ఎంఎఫ్‌ఐల పరిమాణం సంబంధించి ఎన్‌పీఏలు కొంత తక్కువగా 9 శాతంగా ఉంది.  

2022 జూన్‌ 30  నాటికి ‘పోర్ట్‌ఫోలియో ఎట్‌ రిస్క్‌’ (పీఏఆర్‌) 30+ (30 రోజులలోపు రుణాలు) 5.07 శాతానికి మెరుగుపడ్డాయి. 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 5.27 శాతం. 

ఇక ‘పోర్ట్‌ఫోలియో ఎట్‌ రిస్క్‌’ (పీఏఆర్‌) 60+ (60 రోజులలోపు రుణాలు) మాత్రం ఇదే కాలంలో 3.55 శాతం నుంచి 5.60 శాతానికి
క్షీణించాయి.  

పీఏఆర్‌ 30+ స్థాయిలకు సంబంధించి ఎన్‌పీఏలు.. జాతీయ సగటు 5.07 శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి.  

ఇబ్బందులను అధిగమించింది... 
సూక్ష్మ రుణ రంగం మహమ్మారి కరోనా ప్రేరిత ఇబ్బందులను అధిగమించింది. పురోగతి బాటన పయనిస్తోంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఆర్‌బీఐ కొత్త  నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ రంగం చక్కటి వృద్ధి తీరును సాధించింది. – జీజీ మామెన్,సా–ధన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సీఈఓ  

మరిన్ని వార్తలు