నష్టాల సునామీ- అన్ని రంగాలూ బోర్లా

4 Sep, 2020 15:57 IST|Sakshi

634 పాయింట్లు పతనం-38,357కు సెన్సెక్స్‌

194 పాయింట్లు కోల్పోయి 11,334 వద్ద నిలిచిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలు 3-2 శాతం మధ్య డౌన్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1 శాతం మధ్య మైనస్

‌ నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ సుజుకీ మాత్రమే లాభాల్లో..!

టెక్‌ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. వెరసి సెన్సెక్స్‌ 634 పాయింట్లు పడిపోయి 38,357 వద్ద నిలవగా.. నిఫ్టీ 194 పాయింట్లు కోల్పోయి 11,337 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది క్యూ1లో జీడీపీ అనూహ్య క్షీణతను చవిచూడటానికితోడు సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,730 వద్ద గరిష్టానికి చేరగా.. 38,250 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,452- 11,304 పాయింట్ల మధ్య ఒడిదొడుకులకు లోనైంది.

ఒక్కటి మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ 3-2 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ సుజుకీ మాత్రమే(1.75 శాతం) లాభపడిందంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్‌లో టాటా స్టీల్‌, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్, డాక్డర్‌ రెడ్డీస్, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌, విప్రొ, బీపీసీఎల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ 4-2 శాతం మధ్య క్షీణించాయి. 
 
స్వల్ప లాభాలతో
డెరివేటివ్స్‌లోనూ కేవలం అశోక్‌ లేలాండ్‌, సీమెన్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ అదికూడా 0.6-0.2 శాతం మధ్య బలపడ్డాయి.. ఇక మరోపక్క జిందాల్‌ స్టీల్‌, పిరమల్‌, ఐసీఐసీఐ ప్రు, చోళమండలం, పీఎఫ్‌సీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పేజ్‌, ఐబీ హౌసింగ్‌, ఎస్కార్ట్స్‌, ఐడియా, ఫెడరల్‌ బ్యాంక్‌, సెయిల్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1 శాతం చొప్పున డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1723 నష్టపోగా.. 1002 మాత్రమే లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐలు సైలెంట్
గురువారం నగదు విభాగంలో ఇటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 8 కోట్లు, అటు దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం! బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

>
మరిన్ని వార్తలు