పండుగ సందడికి చిప్‌ల సెగ.. నో డిస్కౌంట్స్‌?

8 Oct, 2021 04:21 IST|Sakshi

ఎల్రక్టానిక్స్, మొబైల్స్, వాహన కంపెనీల కష్టాలు

సెమీకండక్టర్ల కొరతతో ఉత్పత్తికి సమస్యలు

పేరుకుపోతున్న ఆర్డర్లు

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ వస్తోందంటే చాలు     ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, మొబైల్స్‌ తదితర రంగాల సంస్థలు అమ్మకాలపై ఆశావహ అంచనాలతో ముందు నుంచే కాస్త ఉత్పత్తి పెంచుకుని, విక్రయాలకు సన్నాహాలు చేసుకుంటాయి. అటు కస్టమర్లు కూడా మంచి డిస్కౌంట్లు లభిస్తాయనే అంచనాలతో ఉంటారు. కానీ, కీలకమైన సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరతతో ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది.

చిప్‌ల సరఫరాలో సమస్యల కారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ పడిపోయింది. ఒక్క ఆటోమొబైల్‌ పరిశ్రమలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు ఆర్డర్లు పేరుకుపోయినట్లు అంచనా. సాధారణంగానైతే పండుగల సీజన్‌లో భారీ డిస్కౌంట్లు పొందే కొనుగోలుదారులు ప్రస్తుత సందర్భంలో మాత్రం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ మొదలుకుని టీవీలు, కార్ల దాకా మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కి తగ్గట్లుగా ఉత్పత్తులు అందుబాటులో లేకపోతుండటంతో ఆటోమోటివ్‌ షోరూమ్‌లలో ఉచిత ఆఫర్లు కనిపించడం లేదు. ‘బుకింగ్స్‌ లేదా ఎంక్వైరీలను బట్టి చూస్తే డిమాండ్‌ బాగానే ఉంది.

కానీ సెమీకండక్టర్ల సమస్యతో ఈసారి దురదృష్టవశాత్తు సరఫరాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుకింగ్స్‌ పేరుకుపోతున్నాయి .. ఉత్పత్తుల సరఫరా ఆ స్థాయిలో ఉండటం లేదు‘ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఈడీ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘పరిశ్రమలో  4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా పెండింగ్‌ బుకింగ్‌లు ఉన్నాయని అంచనా. మారుతీ సుజుకీ ఆర్డర్‌లే దాదాపు 2.15 లక్షల నుంచి 2.2 లక్షల యూనిట్ల దాకా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. గృహోపకరణాల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కార్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటి తయారీలోను సెమీకండక్టర్‌ చిప్‌లు కీలకంగా ఉంటున్నాయి.


ఆగస్టు నుంచే..: చిప్‌ల కొరత, పెండింగ్‌ ఆర్డర్ల సమస్య అక్టోబర్‌లో కొత్తగా వచి్చంది కాదని.. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని శ్రీవాస్తవ తెలిపారు. సరఫరాపరమైన పరిమితుల కారణంగా ఈసారి డిస్కౌంట్లు, బొనాంజా ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉండొచ్చని పేర్కొన్నారు. నవరాత్రులు, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఒక్కసారిగా పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు సాధారణంగా 40 రోజులకు సరిపడ నిల్వలను అట్టే పెట్టుకుంటూ ఉంటారని.. కానీ ఈసారి ఇది 15 రోజుల కన్నా తక్కువ స్థాయిలోనే ఉందని శ్రీవాస్తవ వివరించారు.

గతేడాది అక్టోబర్‌ 1 నాటికి డీలర్ల దగ్గర స్టాక్‌ నిల్వలు 3.35 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈసారి అక్టోబర్‌ 1న ఇది 1.75 లక్షల యూనిట్లకే పరిమితమైనట్లు అంచనా. సెప్టెంబర్‌ 1న నిల్వలు 2.25 లక్షల యూనిట్లుగా నమోదైయ్యాయి. విడిభాగాల సరఫరాదారులను సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో.. ఇంజిన్‌ ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్లు, కీ లెస్‌ ఎంట్రీ, ఏబీఎస్‌ సిస్టమ్స్‌ వంటి భాగాల సరఫరా తగ్గిపోయి వాహనాల తయారీ సంస్థలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.  
(చదవండి: Diwali Offers: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్‌ ఉచితం...!)

ఎల్రక్టానిక్స్‌ రేట్లకు రెక్కలు...
ఇప్పటిదాకానైతే చిప్‌ల కొరత తక్షణ ప్రభావాలు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సరఫరాపై మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. కొత్త సంవత్సరంలో మాత్రం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఉపకరణాల తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు. చిప్‌ల కొరతతో సరఫరా తగ్గి, అంతిమంగా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఈ ధోరణి కనిపిస్తోందని, దేశీ మార్కెట్లోను ఇది జరగవచ్చని బ్రగాంజా పేర్కొన్నారు. పండుగ సీజన్‌ తర్వాత దేశీయంగా తయారీ రంగంపై ప్రభావం కనిపించవచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ సీనియర్‌ అనలిస్ట్‌ ప్రాచిర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలలుగా వివిధ ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో కూడా ఈ ధోరణి కొనసాగవచ్చన్నారు.

ధరలను ప్రత్యేకంగా పట్టించుకునే దేశీ మార్కెట్‌లో విడిభాగాల కొరతతో రేట్లు పెరుగుతూ పోతే .. అంతిమంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని సింగ్‌ చెప్పారు. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో టీవీల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందని థామ్సన్, కొడక్, బ్లౌపంక్‌ వంటి బ్రాండ్‌లను విక్రయించే సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు.

రాబోయే త్రైమాసికంలో ఉత్పత్తి 20–30 శాతం మేర మందగించవచ్చని, 2022 ఆఖరు దాకా ఇదే ధోరణి కొనసాగవచ్చని చెప్పారు. సరఫరా పడిపోవడంతో ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయన్నారు. గత త్రైమాసికంలోనే హై డెఫినిషన్, ఫుల్‌ డెఫినిషన్‌ టీవీల రేట్లు 35 శాతం దాకా పెరిగాయని.. వచ్చే త్రైమాసికంలో మరో 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మార్వా పేర్కొన్నారు.  
(చదవండి: మెర్సిడెజ్‌ బెంజ్‌.. మేడిన్‌ ఇండియా.. ధర ఎంతంటే?)

మరిన్ని వార్తలు