మళ్లీ ఐపీవోల స్పీడ్‌

12 Jul, 2022 05:04 IST|Sakshi

మూడు కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

సెన్‌కో గోల్డ్, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ రెడీ

హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ సైతం.. రూ. 1,605 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: ఆటుపోట్ల మధ్య స్టాక్‌ మార్కెట్లు బలపడుతుండటంతో ప్రైమరీ మార్కెట్లకు మళ్లీ కళ వస్తోంది. తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిధుల సమీకరణ చేపట్టనున్న జాబితాలో జ్యువెలరీ రిటైల్‌ కంపెనీ సెన్‌కో గోల్డ్‌ లిమిటెడ్, ఎలక్ట్రానిక్‌ సబ్‌సిస్టమ్స్, కేబుళ్ల(ఎలక్ట్రానిక్‌) తయారీ సంస్థ డీసీఎక్స్‌ సిస్టమ్స్, మాంసం(ఫ్రోజెన్‌) ఎగుమతుల కంపెనీ హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ చేరాయి. ఈ కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం మూడు కంపెనీలూ ఉమ్మడిగా రూ. 1,605 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి.

సెన్‌కో గోల్డ్‌
ఐపీవోలో భాగంగా సెన్‌కో గోల్డ్‌ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ వాటాదారు సైఫ్‌ పార్టనర్స్‌ ఇండియా 4 లిమిటెడ్‌ మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 525 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 240 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ 127 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. వీటిలో 70 సొంతంకాగా.. మరో 57 ఫ్రాంచైజీలు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సైతం ప్రొడక్టులను విక్రయిస్తోంది. జ్యువెలరీని దుబాయ్, మలేసియా, సింగపూర్‌లకు ఎగుమతి చేస్తోంది.

డీసీఎక్స్‌ సిస్టమ్స్‌
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థలు ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌తోపాటు వివిధ ఎలక్ట్రానిక్‌ కేబుళ్లు, అసెంబ్లీలను రూపొందిస్తోంది.

హెచ్‌ఎంఏ ఆగ్రో
ఐపీవో ద్వారా హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రూ. 480 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 150 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 330 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో రూ. 135 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఆగ్రా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఘనీభవించిన ఎద్దు మాంసంతో కూడిన ప్రొడక్టులను 40 దేశాలకుపైగా ఎగుమతి చేస్తోంది. అమ్మకాలలో 90 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది.

మరిన్ని వార్తలు