Senior Citizens: బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌...!

29 Jun, 2021 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో పాటు పలు బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్‌ సిటిజన్లకు నిర్ణీత కాల డిపాజిట్లపై అధికంగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) పథకంతో అధిక వడ్డీ రేట్లనే కాకుండా, వీటిపై అదనపు ప్రయోజనాలు కూడా రానున్నాయి.

ఇటీవలకాలంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో చాలా మంది ఖాతాదారులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చేయడం లేదు. తిరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) పై ఉన్న రేట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పథకాన్ని 2021 సెప్టెంబర్‌ 30 వరకు పెంచుతూ బ్యాంకులు ఉత్తర్వులు జారీ చేశాయి. 

ఎస్‌బీఐ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీం ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
సీనియర్‌ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంతో సాధారణ ఖాతాదారులకు లభించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అధికంగా అందిస్తుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ  సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఎఫ్‌డీపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక ఎఫ్‌డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీ రేట్లను ఇవ్వనుంది.

రిటైల్ టర్మ్‌ డిపాజిట్‌ విభాగంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్‌బీఐ  ప్రవేశపెట్టిన  ‘ఎస్‌బీఐ వీకేర్‘ లో భాగంగా 30 బిపిఎస్ అదనపు ప్రీమియం పాయింట్లను వారి రిటైల్ టిడి కోసం చెల్లించబడుతుంది. అందుకోసం ఆయా బ్యాంకుల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఖాతాదారునిగా ఉండాలి. ఎస్‌బీఐ వీ కేర్‌ పథకాన్ని సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీం ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
ఐదు సంవత్సరాల వ్యవధితో 5 కోట్ల కన్నా తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కలిగి ఉన్న సీనియర్‌ సిటిజన్లకు అదనంగా  0.25% అదనపు ప్రీమియం అందించనుంది. ఈ ప్రత్యేక డిపాజిట్ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంక్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ స్పెషల్‌ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 75 బిపిఎస్‌ పాయింట్లను కూడా ఇవ్వనుంది. ప్రత్యేక ఎఫ్‌డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీం ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 100 కంటే ఎక్కువ బిపిఎస్ పాయింట్లను ఇస్తోంది. ఈ పథకంలో  డిపాజిట్ చేస్తే 6.25 వడ్డీ రేటు లభిస్తోంది.

చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ

మరిన్ని వార్తలు