దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రన్‌ అదిరెన్‌

12 Nov, 2022 06:45 IST|Sakshi

ముంబై: ఆర్థిక అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడంతో దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు తీసింది. రూపాయి అనూహ్య రికవరీ, విదేశీ కొనుగోళ్లు ర్యాలీకి మద్దతునిచ్చాయని ట్రేడర్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, రియల్టీ షేర్లు రాణించడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,181 పాయింట్లు పెరిగి 61,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు బలపడి 18,350 వద్ద నిలిచింది.

గతేడాది అక్టోబర్‌ 18 తర్వాత ఇరు సూచీలకిది గరిష్ట ముగింపు స్థాయి కావడం విశేషం. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏడున్నర శాతం ర్యాలీ చేయడంతో ఐటీ షేర్లకు భారీ గిరాకీ నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,958 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.616 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్‌ మూడుశాతం ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో రూ.2.87  లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే  బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.284.46 లక్షల కోట్లకు చేరింది.  ట్రేడింగ్‌ నాలుగురోజులే జరిగిన ఈ వారంలో సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి.  

లాభాలు ఇందుకే 
అమెరికా అక్టోబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదవడంతో ఇకపై ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఎఫ్‌ఐఐలు ఈ నవంబర్‌ ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటంతో ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.  

అయిదోరోజూ రూపీ పరుగు 
రూపాయి పరుగు అయిదోరోజూ కొనసాగింది. డాలర్‌ మారకంలో 62 పైసలు బలపడి 80.78 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్‌ ద్రవ్యోల్బణం భారీగా దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత దేశీయ కరెన్సీ ర్యాలీకి మద్దతుగా నిలిచినట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  

డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ రంగానికి చెందిన డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ షేరు లిస్టింగ్‌ రోజే భారీ లాభాలను పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.207)తో పోలిస్తే 38 శాతం ప్రీమియంతో రూ.286 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 55% ర్యాలీ చేసి రూ.320 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 49శాతం లాభంతో రూ.309 వద్ద స్థిరపడింది. 

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు వరుసగా 6%, ఐదుశాతం చొప్పున లాభపడ్డాయి.   

సెప్టెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత జొమాటో షేరు 14 శాతం లాభపడి రూ.72.80 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో మొత్తం 3.19 కోట్ల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు