స్వల్ప లాభాలతో సరి

13 Oct, 2020 05:54 IST|Sakshi

ఆరంభ లాభాలు ఆవిరి 

నిరాశపరిచిన కేంద్ర పండుగ ప్యాకేజీ ప్రకటన

కలవరపెట్టిన కరెంట్‌ కోత

బ్యాంకింగ్, మెటల్‌ షేర్లలో అమ్మకాలు

సూచీలకు ఐటీ షేర్ల అండ 

ఇంట్రాడేలో 12,000 స్థాయిని అందుకున్న నిఫ్టీ

కేంద్రం ఉద్యోగులకు ప్రకటించిన పండుగ ప్యాకేజీ మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో సూచీలు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 84 పాయింట్లు పెరిగి 40,593 వద్ద నిలిచింది. నిఫ్టీ 17 పాయింట్లు ఆర్జించి 11,931 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా 8 రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు బ్యాంకింగ్, మెటల్, అటో, ఫైనాన్స్‌ సర్వీస్, మీడియా, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యా యి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,867 – 12,022 శ్రేణిలో కదలాడగా.. సెన్సెక్స్‌ 40,387 – 40,905 రేంజ్‌లో ఊగిసలాడింది.  

12,000 స్థాయిని అందుకున్న నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో మన సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఉదయం సెషన్‌లో సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్‌ షేర్లకు అధిక డిమాండ్‌ నెలకొంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లను ఆర్జించి 40,905 స్థాయిని తాకింది. నిఫ్టీ 108 పాయింట్ల మేర లాభపడి 12,000 మార్కును అందుకుంది. ఇంట్రాడే 12,022 వద్ద గరిష్టాన్ని తాకింది.  

నిరాశపరిచిన పండుగ ప్యాకేజీ ప్రకటన  
వ్యవస్థలో వినిమయ డిమాండ్‌ కొరత తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఉద్యోగికి రూ.10 వేల పండుగ అడ్వాన్స్‌తో పాటు ప్రయాణ ఓచర్లను ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపింది. ఉద్దీపన ప్యాకేజీని ఆశించిన మార్కెట్‌ వర్గాలకు ఈ పండుగ ప్యాకేజీ ప్రకటన తీవ్ర నిరాశను కలిగించింది. దీంతో ప్రధాన షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోసుకుంది. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

కలవరపెట్టిన కరెంట్‌ కోత
దేశ ఆర్థిక రాజధాని, స్టాక్‌ ఎక్సే్చంజీలకు స్థావరమైన ముంబైలో విద్యుత్‌ అంతరాయం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దక్షిణ ముంబై ప్రాంతంలో పవర్‌ గ్రిడ్‌ వైఫల్యంతో ఉదయం 10 గంటలకు విద్యుత్తు సరఫరాలో భారీ అంతరాయమేర్పడింది. అయితే ఎలాంటి సమస్య వచ్చినా పూర్తిస్థాయి ముందస్తు చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని, మార్కెట్‌ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని ఎన్‌ఎస్‌ఈ, సెన్సెక్స్‌ ఎక్సే్చంజీలు వివరణ ఇచ్చాయి.
‘‘కేంద్రం ప్రకటించిన పండుగ ప్యాకేజీ స్వల్పకాలిక ప్రయోజనమే. వ్యవస్థలో స్థిర వృద్ధిని నెలకొల్పే నిబద్ధత ప్యాకేజీలో కన్పించడం లేదు. కేంద్రం ప్యాకేజీ మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తిపరచలేదు. అందుకే మార్కెట్లో అమ్మకాలు నెలకొన్నాయి’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ విభాగపు అధిపతి అర్జున్‌ యశ్‌ మహజన్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు