మెప్పించని ఆర్థిక సర్వే.. నష్టాల్లో మార్కెట్‌

30 Jan, 2021 05:45 IST|Sakshi

ఆరోరోజూ అమ్మకాలే 

సెన్సెక్స్‌ నష్టం 589 పాయింట్లు

183 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 

కొనసాగిన ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ 

బలహీన అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు  

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో మార్కెట్‌ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది. సూచీలకిది ఆరోరోజూ నష్టాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు   మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు రెండోరోజూ రూ.2,443 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు రూ. 5933 కోట్ల భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

‘‘ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ కో?లుకునేందుకు దీర్ఘకాలం పడుతుందనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మరోవైపు ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా ఉంది. ఈ పరిణామాలతో బడ్జెట్‌కు ముందు మార్కెట్లో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది.’’ అని జియోజిత్‌ ఫైనాన్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.

ఆరు రోజుల్లో రూ.11.57 లక్షల కోట్లు ఆవిరి..!
మార్కెట్‌ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు రూ.11.57 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి రూ.197.46 లక్షల కోట్ల నుంచి రూ. 186.12 లక్షల కోట్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 2.01 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇదే ఆరురోజుల్లో సెన్సెక్స్‌ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లను కోల్పోయాయి.  

నిరాశపరిచిన ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ లిస్టింగ్‌..!
గడిచిన వారంలో ఐపీఓను పూర్తిచేసుకున్న ఐఆర్‌ఎఫ్‌సీ షేర్లు లిస్టింగ్‌లో నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.26 తో పోలిస్తే బీఎస్‌ఈలో 3.84 శాతం(రూపాయి)నష్టంతో రూ.25 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 6.53 శాతం క్షీణించి రూ.24.30 కు చేరుకుంది. చివరికి 4.42 శాతం పతనమైన రూ.24.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ వ్యాల్యుయేషన్‌ రూ.32,475 కోట్లుగా నమోదైంది. దాదాపు రూ.4,633 పరిమాణం కలిగిన ఈ ఐపీఓకు 3.49 రెట్ల అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు