మార్కెట్‌పై బేర్‌ ఎటాక్‌!

5 Sep, 2020 04:16 IST|Sakshi

ఆరంభం నుంచీ ఆగని పతనం 

ప్రపంచ మార్కెట్ల భారీ క్షీణత ప్రభావం

ప్రభావం చూపని రూపాయి పెరుగుదల 

సెన్సెక్స్‌ 634 పాయింట్లు డౌన్‌

11,334కు నిఫ్టీ; 194 పాయింట్లు క్రాష్‌..

ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్‌ కూడా శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బాగా క్షీణించడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటం, కరోనా కేసులు పెరుగుతుండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 73.14కు చేరినా మన మార్కెట్‌ పతనం ఆగలేదు. 

సెన్సెక్స్‌ 634 పాయింట్లు పతనమై 38,357 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు క్షీణించి 11,334 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 1.63 శాతం, నిఫ్టీ 1.68 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 1,110 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలు..
సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 666 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా ఈ నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 741 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లమేర నష్టపోయాయి. లోహ, విద్యుత్తు, టెలికం, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.

మరిన్ని విశేషాలు..
► సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క మారతీ సుజుకీ షేర్‌ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి.  

► యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

► స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగాషేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వొడాఫోన్‌ ఐడియా,అదానీ గ్యాస్, గ్రాన్యూల్స్‌ ఇండియా, వీఎస్‌టి టిల్లర్స్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా మన దగ్గర కూడా ఐటీ షేర్లు నష్టపోయాయి.  

► త్వరలో వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్‌ పాలసీ) ప్రభుత్వం ప్రకటించనున్నదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి.  

► ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు వరుసగా నాలుగో రోజూ లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఈ షేర్లతో పాటు మరో 200కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి.  అదానీ గ్రీన్, మ్యాక్స్‌ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రూ.2.23 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ.2.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.  బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2.23 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.154.63 లక్షల కోట్లకు తగ్గింది.

అప్రమత్తంగా ఉండండి..: నిపుణులు
కరోనా కేసుల జోరు, ప్రపంచ మార్కెట్ల పతనం, చైనాతో  సరిహద్దు ఉద్రిక్తతలు, మన మార్కెట్‌ వేల్యూయేషన్లు అధికంగా ఉండటం.. ఇవన్నీ కీలకమైన రిస్క్‌ అంశాలని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పతనానికి ప్రధాన కారణాలు
అమెరికా స్టాక్‌ సూచీల పతనం: గత రెండు నెలల్లో భారీగా ఎగసిన టెక్నాలజీ షేర్లలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికా స్టాక్‌ సూచీలు 3–5 శాతం రేంజ్‌లో  నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్‌  మార్కెట్లు కూడా నష్టపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.  

బ్యాంక్‌ షేర్ల పతనం..: మారటోరియం రుణాలపై  వడ్డీ వసూలు విషయమై సుప్రీం కోర్టులో విచారణ  నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.  

హెవీ వెయిట్స్‌కు నష్టాలు..: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి.  

చైనాతో సరిహద్దు  ఉద్రిక్తతలు..: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.

మరిన్ని వార్తలు