అమ్మకాల వెల్లువ

4 Aug, 2020 05:30 IST|Sakshi

నాలుగో రోజూ నష్టాలే

సెన్సెక్స్‌ 667 పాయింట్లు డౌన్‌

10,900 దిగువకు నిఫ్టీ

ముంబై: భారీ వ్యాల్యుయేషన్లు, పెరిగిపోతున్న కరోనా కేసుల భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో రోజూ నష్టాలు నమోదు చేశాయి. సోమవారం సెన్సెక్స్‌ 667 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 10,900 పాయింట్ల దిగువన క్లోజయ్యింది. రూపాయి క్షీణత, స్థూల ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన గణాంకాలు నిరాశావహంగా ఉండటంతో ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపాయని ట్రేడర్లు తెలిపారు. సోమవారం నెగెటివ్‌లోనే ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆసాంతం నష్టాల్లోనే ట్రేడయ్యింది. చివరికి 1.77 శాతం క్షీణతతో 36,939.60 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 1.64 శాతం (సుమారు 182 పాయింట్లు) నష్టంతో 10,892 వద్ద క్లోజయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో సెన్సెక్స్‌ 1,553 పాయింట్లు, నిఫ్టీ 409 పాయింట్ల నష్టపోయాయి.

బ్యాంకింగ్‌ స్టాక్స్‌ డౌన్‌
సెన్సెక్స్‌లోని కీలక స్టాక్స్‌లో కోటక్‌ బ్యాంక్‌ అత్యధికంగా 4.41 శాతం క్షీణించింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు గణనీయంగా తగ్గాయి. కేవలం ఆరు స్టాక్స్‌ (టైటాన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్, పవర్‌గ్రిడ్‌ మాత్రమే సుమారు 3.15 శాతం దాకా పెరిగి లాభాలు నమోదు చేశాయి.

దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ) షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు నష్టపోయాయని ట్రేడర్లు తెలిపారు. వీటితో పాటు విదేశీ పెట్టుబడులు తరలిపోయే భయాలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా వైరస్‌ కేసులపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు రిస్కులు తగ్గించుకుంటున్నారని వివరించారు. ‘వైరస్‌ కేసులు పెరుగుతుండటం, కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలపై అనిశ్చితి మొదలైనవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంస్థల స్టాక్స్‌.. సూచీల పతనానికి కారణంగా ఉంటున్నాయి.

వేగం మందగించినప్పటికీ ఆర్థిక ఫలితాలు, విశ్లేషణలను బట్టి ఆయా షేర్లలో కదలికలు ఉంటున్నాయి. మార్కెట్లు ప్రస్తుత శ్రేణిని నిలబెట్టుకోగలిగితే, ఈ పతనాలు స్వల్పకాలికమైనవిగానే ఉండగలవు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పోర్ట్‌ఫోలియోలో నాణ్యమైన షేర్లను మరికాస్త పెంచుకోవచ్చు‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. బీఎస్‌ఈ బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, రియల్టీ, టెలికం తదితర సూచీలు 2.73 శాతం దాకా క్షీణించగా, కన్జూమర్‌ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, మెటల్‌ తదితర సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ 0.31 శాతం తగ్గగా, స్మాల్‌ క్యాప్‌ సూచీ 1.02 శాతం పెరిగింది.

అంతర్జాతీయంగా..: షాంఘై, టోక్యో, సియోల్‌ సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్‌ సూచీ నష్టపోయింది. ఇక యూరప్‌  సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి.

మరిన్ని వార్తలు