మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు

24 Sep, 2020 06:22 IST|Sakshi

రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల జోరుతో తగ్గిన నష్టాలు 

సెన్సెక్స్‌ 66 పాయింట్లు డౌన్‌ 22 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, మన మార్కెట్‌ మాత్రం నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో మొదలై, నష్టాల్లోకి జారిపోయి, భారీ నష్టాల నుంచి ఒకింత రికవరీ అయ్యాయి. ఇంట్రాడేలో 406 పాయింట్లు పెరిగిన  సెన్సెక్స్‌ చివరకు 66 పాయింట్ల నష్టంతో 37,668 పాయింట్ల వద్ద ముగిసింది.  నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,132  పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్‌ సూచీల నష్టాలు వరుసగా ఐదో రోజూ  కొనసాగాయి. మార్చి 2వ తేదీ తర్వాత స్టాక్‌ సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం ఇదే మొదటిసారి. యూరప్‌లో కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటం, ఆర్థిక రికవరీపై  సంశయాలు కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి.

సరిహద్దు స్థావరాల వద్దకు అదనపు బలగాలను పంపించకూడదని, వీలైనంత త్వరలో మళ్లీ చర్చలు జరపాలని భారత్, చైనాలు ఒక అంగీకారానికి రావడం,  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. టెలికం, ఆర్థిక రంగ షేర్లు పతనమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం 1 పైసా పెరిగి 73.57 వద్దకు చేరింది.  డేటా, స్ట్రీమింగ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను రిలయన్స్‌ జియో ప్రకటించిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 8 శాతం నష్టంతో రూ.434 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఇక వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 10%నష్టంతో రూ.9.22 వద్ద ముగిసింది. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి.

హెచ్‌డీఎఫ్‌సీ 5000 కోట్ల సమీకరణ:  భారత ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఒకటైన హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ బేసిస్‌పై బాండ్లను జారీ చేయనున్నట్లు బుధవారం  తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా