2021కి...లాభాలతో స్వాగతం...

2 Jan, 2021 03:27 IST|Sakshi

14,000 శిఖరంపై నిఫ్టీ ముగింపు

47,869 వద్ద స్థిరపడిన సెన్సెక్స్‌

రాణించిన ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు  

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ 2021 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికింది. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించడంతో కొత్త ఏడాది తొలిరోజున రికార్డుల పర్వం కొనసాగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారమూ లాభాలతో ముగిశాయి. జీఎస్‌టీ అమలు తర్వాత ఈ డిసెంబర్‌లో ఒక నెలలో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు వసూళ్లను సాధించడంతో పాటు ఆటో కంపెనీలు వెల్లడించిన వాహన విక్రయ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి.

అలాగే భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించవచ్చనే వార్తలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో  సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 47,869 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,018 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 229 పాయింట్లు లాభపడి 47,980 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,050 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు నూతన గరిష్టాలను తాకిన తరుణంలోనూ ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 269 పాయింట్లను ఆర్జించింది.  

ఆటో షేర్ల లాభాల పరుగులు...
డిసెంబర్‌లో అంచనాలకు తగ్గట్టుగానే వాహన విక్రయాలు జరిగాయని ఆటో కంపెనీలు ప్రకటించాయి. దీనికి తోడు ఇటీవల పలు ఆటో కంపెనీలు తమ వాహనాలపై పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు 4 నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి.  

ఆంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ లిస్టింగ్‌ విజయవంతం...  
గతేడాదిలో చివరిగా ఐపీఓను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ షేర్లు ఎక్ఛ్సేంజీల్లో లాభాలతో లిస్ట్‌ అయ్యాయి. ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 36% ప్రీమియం ధరతో రూ. 436 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో 55 శాతానికి పైగా లాభపడి రూ.489.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరకు 29 శాతం లాభంతో రూ.407 వద్ద స్థిరపడ్డాయి. మునిసిపల్‌ సోలిడ్‌ వేస్ట్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ గత నెల చివర్లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి.

మరిన్ని వార్తలు