మూడోరోజూ ముందడుగే

4 Mar, 2021 06:10 IST|Sakshi

సెన్సెక్స్‌ లాభం 1,148 పాయింట్లు

51 వేల పైన ముగింపు

15,200 ఎగువకు నిఫ్టీ 

రాణించిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు

ర్యాలీకి మద్దతిచ్చిన రిలయన్స్‌ షేరు 

సెంటిమెంట్‌ను బలపరిచిన రూపాయి ర్యాలీ 

ఆటో షేర్లలో లాభాల స్వీకరణ

ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు రాణించడంతో మార్కెట్‌ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్‌ 1,148 పాయిం ట్లు లాభపడి 51 వేల పైన 51,445 వద్ద స్థిరపడింది. సెన్సెక్‌ సూచీ వెయ్యికి పైగా పాయింట్లను ఆర్జించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. నిఫ్టీ 327 పాయింట్లు పెరిగి 15,200 ఎగువన 15,246 వద్ద ముగిసింది. ఒక్క ఆటో షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్‌ షేర్లు లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం భారీ లాభంతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టీసీఎస్‌ షేరుతో పాటు ఆటో షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు కొంత తడబడ్డాయి. అయితే మెటల్‌ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. రిలయన్స్‌ షేరు ర్యాలీకి ప్రాతినిధ్యం వహించింది. ట్రేడింగ్‌ ముగిసేంత వరకు సూచీలు స్థిరంగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,242 వద్ద పాయింట్లు లాభపడి 51,539 వద్ద, నిఫ్టీ 354 పాయింట్లు పెరిగి 15,273 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు 2089 కోట్ల విలువైన షేర్లను కొనగా, డీఐఐలు రూ.393 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  

లాభాలు ఎందుకంటే..?
దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని కేంద్రం మరోసారి హామీ ఇవ్వడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. డిసెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలతో పాటు ఇప్పటి వరకు వెల్లడైన ఫిబ్రవరి స్థూల/సూక్ష్మ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. అలాగే టెలికం శాఖ చేపట్టిన వేలం పాటలో ప్రభుత్వ అంచనా కంటే అధికంగా స్పెక్ట్రం అమ్ముడైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి 65 పైసలు బలపడటం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ స్థిరత్వం కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించి ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చాయి.

రిలయన్స్‌ షేరుకు స్పెక్ట్రం జోష్‌..!
టెలికాం శాఖ చేపట్టిన స్పెక్ట్రం వేలంలో రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ సగానికి పైగా స్పెక్ట్రంను దక్కించుకోవడంతో కంపెనీ షేరు బుధవారం 4.50 శాతం లాభపడింది. రూ.2,202 వద్ద స్థిరపడింది.

3 రోజుల్లో 9.41 లక్షల కోట్లు..
మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలతో గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 2,345 పాయింట్లు, నిఫ్టీ 716 పాయింట్లు లాభపడ్డాయి. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు అంతే మొత్తంలో సంపదను ఆర్జించారు.చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.5.72 లక్షల కోట్లను సొంతం చేసుకున్న ఇన్వెస్టర్లు బుధవారం మరో రూ.3.69 లక్షల కోట్లను వెనకేసున్నారు. దీంతో కేవలం మూడురోజుల్లోనే రూ.9.41 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.210 లక్షల కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు