బుల్స్‌ బౌన్స్‌బ్యాక్‌

22 Jun, 2021 02:39 IST|Sakshi

బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో యూ–టర్న్‌

పతనాన్ని అడ్డుకున్న రిలయన్స్‌

చివర్లో మెటల్‌ షేర్ల మెరుపులు

మైనస్‌ 604 నుంచి ప్లస్‌ 230 పాయింట్లకు సెన్సెక్స్‌

59 పాయింట్ల పరిధిలో ట్రేడైన నిఫ్టీ

ముంబై: ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలతో భారీగా పతనమైన సూచీలు..,  బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అయ్యి లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 604 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ చివరికి 230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 177 పాయింట్ల నష్టం నుంచి కోలుకుని 63 పాయింట్లు పెరిగి 15,747 వద్ద నిలిచింది. ఐటీ, ఆటో మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఒక శాతం రాణించి సూచీల పతనాన్ని అడ్డుకుంది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ బ్యాంక్‌ ప్రైవేటీకరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయనే వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకోవడమే కాకుండా లాభాలన్ని ఆర్జించగలిగాయి. ఇటీవల కరెక్షన్‌తో దిగివచ్చిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకశాతం లాభపడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెనెక్స్‌ 803 పాయింట్ల శ్రేణిలో, నిఫ్టీ 259 పాయింట్ల పరిధిలో కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1245  కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.138 కోట్ల షేర్లను కొన్నారు.

803 పాయింట్ల శ్రేణిలో ట్రేడైన సెన్సెక్స్‌  
వచ్చే ఏడాదిలో ద్వితీయార్థం చివర్లో వడ్డీరేట్లను పెంచవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్‌ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ ఏకంగా 456 పాయింట్ల నష్టంతో 51,888 వద్ద, నిఫ్టీ 157 పాయింట్లను కోల్పోయి 15,526 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు మరింత నష్టపోయాయి. సెన్సెక్స్‌ 604 పాయింట్లను కోల్పోయి 51,740 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 15,506 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ దశలో నిఫ్టీకి 15,500 వద్ద సాంకేతిక మద్దతు లభించింది. రిలయన్స్‌ షేరు ఒక శాతం రాణించి మార్కెట్‌ పతనాన్ని అడ్డుకుంది. అలాగే బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో సూచీలు క్రమంగా ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. చివర్లో మెటల్‌ షేర్లు మెరవడంతో సూచీలు లాభాలతో ముగిశాయి.  

‘‘ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపునకు ముందు మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు సహజం. అందరికీ ఉచితంగా టీకా బాధ్యత కేంద్రానిదే అని ప్రధాని మోదీ ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికంటే వేగంగా రికవరీ అవ్వొచ్చనే ఆశలు సూచీలను నష్టాల్లోంచి లాభాల వైపు నడిపించాయి. ట్రెండ్‌ రివర్స్‌ అయ్యేంత వరకు మార్కెట్‌ పతనమైన ప్రతిసారి నాణ్యమైన షేర్లను కొనవచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 5% పతనమై రూ.701 వద్ద ముగిసింది. ప్రైవేట్‌ ఈక్విటీ కార్లైల్‌ గ్రూప్‌ సంస్థ నుంచి పీఎన్‌బీ హౌసిం గ్‌ ఫైనాన్స్‌ రూ.4 వేల కోట్ల నిధులను సేకరించాలన్న ప్రతిపాదనను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అడ్డుకోవడం షేరు నష్టానికి కారణమైంది.  
► ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ గరిష్ట బిడ్‌ను ఆఫర్‌ చేయడంతో రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేరు బీఎస్‌ఈ ఐదు శాతం లాభపడి రూ.6 వద్ద ముగిసింది.
► వార్షిక సర్వసభ్య సమావేశానికి(జూన్‌ 24) ముందు రిలయన్స్‌ షేరు రాణించింది. బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.2247 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి ఒకశాతం లాభపడి రూ.2247 వద్ద స్థిరపడింది.  
► ప్రైవేటీకరణ వార్తలతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ బ్యాంక్‌ షేరు 20 శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. ఈ రెండు షేర్లు వరుసగా రూ.20లు, రూ.24లు వద్ద ముగిశాయి.  
► సూక్ష్మ ఆర్థిక సంస్థల రుణాలపై ఆస్సాం ప్రభుత్వం ఉపశమనం కలిగించడంతో బంధన్‌ బ్యాంక్‌ 8% లాభపడి రూ. 341 వద్ద ముగిసింది.

24 పైసలు పతనమైన రూపాయి
74.10 స్థాయి వద్ద ముగింపు  
ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం 24 పైసలు పతనమై 74.10 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 74.20 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ బలపడటం రూపాయికి ప్రతికూలంగా మారడంతో తొలి సెషన్‌లో 42 పైసలు నష్టపోయి 74.08 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రెండో భాగంలో రికవరీ బాట పట్టింది. ఈ క్రమంలో 74.28 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. క్రూడ్‌ ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు, డాలర్‌ ఇండెక్స్‌ కదలికలు వంటి అంశాలు రానున్న రోజుల్లో రూపాయికి దిశానిర్దేశం కానున్నాయని ఫారెక్స్‌ నిపుణులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు