సూచీలకు స్వల్ప నష్టాలు

14 Sep, 2021 03:24 IST|Sakshi

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు

127 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

నిఫ్టీ నష్టం 14 పాయింట్లు

ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సోమవారం స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 127 పాయింట్లను కోల్పోయి 58,178 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు పతనమైన 17,355 వద్ద స్థిరపడ్డాయి. జియో స్మార్ట్‌ఫోన్‌ విడుదల వాయిదాతో ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు రెండు శాతానికి పైగా నష్టపోయి సూచీల పతనాన్ని శాసించింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 18 పైసల పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆ

ర్‌బీఐ వడ్డీరేట్లను ప్రభావితం చేయగల రిటైల్, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణ పెరుగుదల ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 360 పాయింట్లు నష్టపోయి 57,945 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయి 17,269 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1419 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.560 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.  

ఆరంభ నష్టాలు రికవరీ...  
మూడు రోజుల విరామం తర్వాత సోమవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 43 పాయింట్ల పతనంతో 58,262 వద్ద, నిఫ్టీ ఐదు పాయింట్ల స్వల్ప నష్టంతో 17,363 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో పాటు బ్యాంకింగ్, రిలయన్స్‌ షేర్ల పతనంతో తొలి సెషన్‌లోనే సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 360 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయాయి. అయితే మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి.

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ పూర్తి
ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)ను పూర్తి చేసినట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 1,648.53 సగటు ధరలో మొత్తం 5.58 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేసినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 9,200 కోట్లను వెచి్చంచింది.  బైబ్యాక్‌లో భాగంగా గరిష్టంగా రూ. 1,750, కనిష్టంగా రూ. 1,538 ధరలో షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్‌ పూర్తిచేసిన వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,691 వద్దే ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,702–1,675 మధ్య ఊగిసలాడింది.

13న క్యూ2 ఆర్థిక ఫలితాలు
ఇన్ఫోసిస్‌ వచ్చే నెల 13వ తేదిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. ‘అక్టోబర్‌ 12–13 తేదీల్లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు  భేటీ జరగనుంది. క్యూ2 ఫలితాలతో పాటు బోర్డు నిర్ణయాలను 13న వెల్లడిస్తాం’ అని ఇన్ఫీ తెలిపింది.  

మార్కెట్లో మరిన్ని విశేషాలు
► జియో నెక్ట్స్‌ ఫోన్‌ విడుదల వాయిదా రిలయన్స్‌ కంపెనీ(ఆర్‌ఐఎల్‌) షేరుపై పడింది. ఈ వినాయక చవితి(సెపె్టంబర్‌ 10న)కి విడుదల కావల్సిన ‘‘జియోఫోన్‌ నెక్ట్స్‌’’ దీపావళి పండుగకి లాంచ్‌ చేస్తామని శుక్రవారం రిలయన్స్‌ అనుబంధ టెలికాం సంస్థ జియో తెలిపింది. దీంతో షేరు 2% నష్టంతో రూ.2,372 వద్ద ముగిసింది.
► బొగ్గు ధరలు పెంచాలనే నిర్ణయంతో కోల్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీలో ఈ షేరు టాప్‌ గెయినర్‌గా నిలించింది.
► వృద్ధి ఆందోళనలతో వరాక్‌ ఇంజనీరింగ్‌ షేరు రూ.236 వద్ద  ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 3% నష్టంతో రూ.265 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు