గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ

20 May, 2021 02:13 IST|Sakshi

50 వేల దిగువకు సెన్సెక్స్‌ 

నిఫ్టీకి 78 పాయింట్ల నష్టం

మెటల్, ఆర్థిక, ఐటీ షేర్ల అమ్మకాలు 

రాణించిన ఫార్మా, ప్రభుత్వరంగ షేర్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

సెంటిమెంట్‌ను దెబ్బతీసిన రూపాయి పతనం

ముంబై: సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 13 పైసల పతనం కూడా ప్రతికూలంగా మారింది. ఫలితంగా సెన్సెక్స్‌ 291 పాయింట్లను కోల్పోయి 50వేల దిగువున 49,903 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లను కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది.

మెటల్, ఆర్థిక, ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం లాభపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 362 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. ఎఫ్‌ఐఐలు రూ.698 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.853 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.  

‘‘ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. కమోడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలు దేశీయ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అయితే క్రమంగా తగ్గుతున్న కోవిడ్‌ కేసులు.., మార్కెట్లో భారీ అమ్మకాలను అడ్డుకున్నాయి’’ జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఇంట్రాడేలో నిఫ్టీ 100  పాయింట్లు క్రాష్‌...
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 104 పాయింట్ల నష్టంతో 50,089 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లను కోల్పోయి 15,059 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత రెండురోజులుగా సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, ప్రైవేట్‌ బ్యాంక్స్, మెటల్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్‌ 362 పాయింట్లను కోల్పోయి 49,831 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయి 15,009 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

>
మరిన్ని వార్తలు