మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

29 Sep, 2021 01:10 IST|Sakshi

ఇంట్రాడేలో ఒడిదుడుకుల ఇంట్రాడే

సెంటిమెంట్‌ను దెబ్బతీసిన రూపాయి పతనం 

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు 

ఐటీ, ఆర్థిక, టెలికం షేర్లలో లాభాల స్వీకరణ 

60 వేల దిగువకు సెన్సెక్స్‌ 

నిఫ్టీ నష్టం 106 పాయింట్లు

ముంబై: స్టాక్‌ సూచీల మూడు రోజుల లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, ఆర్థిక, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్‌తో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపు(గురువారం) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. డాలర్‌ మారకంలో రూపాయి 23 పైసలు పతనమైంది.

ఫలితంగా సెన్సెక్స్‌ 410 పాయింట్లు పతనమై 60 వేల దిగువున 59,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17,749 వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌ ఆద్యంతం స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1243 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 337 పాయింట్ల రేంజ్‌ కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1958 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.161 కోట్ల షేర్లను కొన్నారు.  

లాభాలతో మొదలై నష్టాల్లోకి..,  
దేశీయ మార్కెట్‌ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 208 పాయింట్లు లాభంతో 60,286 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,906 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో ప్రతికూలతలతో పాటు గరిష్ట స్థాయి లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాలతో మొదలవడంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(60,288) నుంచి 1243 పాయింట్లు నష్టపోయి 59,046 వద్ద, నిఫ్టీ డే హై(17,913) నుంచి 337 పాయింట్లు కోల్పోయి 17,912 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

నష్టాలు పరిమితం  
మిడ్‌ సెషన్‌ చివర్లో సూచీలకు దిగువ స్థాయిల వద్ద మద్దతు లభించడంతో అమ్మకాలు తగ్గాయి. మరో గంటలో ట్రేడింగ్‌ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకొని పరిమిత నష్టాలతో ముగిశాయి. 

మార్కెట్‌లో మరిన్ని సంగతులు...  
సోలార్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఎన్‌టీపీసీ షేరు నాలుగు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. 
ఆర్‌బీఐ రెండు కోట్ల జరిమానా విధించడంతో ఆర్‌బీఎల్‌ షేరు రెండుశాతం నష్టపోయి రూ.187 వద్ద ముగిసింది.  
గోవా షిప్‌యార్డ్‌ నుంచి కాంట్రాక్టు దక్కించుకోవడంతో భెల్‌ షేరు ఆరుశాతం ర్యాలీ చేసి రూ.60 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు