మళ్లీ ‘డ్రాగన్‌’ షాక్‌!

1 Sep, 2020 05:20 IST|Sakshi

లద్దాఖ్‌లో మళ్లీ  చైనా చొరబాటు

నేటి నుంచి  కొత్త ‘మార్జిన్‌’ నిబంధనలు 

పై స్థాయిల్లో లాభాల స్వీకరణ 

21 పైసలు పతనమైన రూపాయి 

క్యూ1 జీడీపీ గణాంకాలపై అనిశ్చితి 

ఉదయం లాభాలు ఆవిరి  

839  పాయింట్ల నష్టంతో 38,628 వద్ద ముగింపు 

నిఫ్టీ 260 పాయింట్లు డౌన్‌; 11,388 వద్ద క్లోజ్‌

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్‌లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి.

సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్‌ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్‌’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి.

సెన్సెక్స్‌ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక   జపాన్‌ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి.   

సెబీ కొత్త ‘మార్జిన్‌’ నిబంధనలు...
స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్‌ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్‌ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది.

మరిన్ని మార్కెట్‌ విశేషాలు...
► సన్‌ఫార్మా షేర్‌ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.
► 30 సెన్సెక్స్‌ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి.  
► ఫ్యూచర్‌ గ్రూప్, రిలయన్స్‌ డీల్‌ నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లన్నీ అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది.
► స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి.   
► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి
► స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది.

మరిన్ని వార్తలు