46,000 దాటేసిన సెన్సెక్స్‌ప్రెస్‌

9 Dec, 2020 14:59 IST|Sakshi

495 పాయింట్ల హైజంప్‌- 46,103కు సెన్సెక్స్‌

136 పాయింట్లు ఎగసి 13,529 వద్ద ముగిసిన నిఫ్టీ

మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ జోరు

మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ వెనకడుగు

ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరోసారి సరికొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్‌ 495 పాయింట్లు జంప్‌చేసి 46,103 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 46,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 136 పాయింట్లు జమ చేసుకుని 13,529 వద్ద స్థిరపడింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం రికార్డ్‌ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్‌-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,164 వద్ద‌, నిఫ్టీ 13,549 వద్ద కొత్త రికార్డులను సాధించాయి. చదవండి: (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

మీడియా స్పీడ్‌..
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే  పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ 1-0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ 4.7-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్‌, విప్రో, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌, మారుతీ,  ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, సిప్లా 1.5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. చదవండి: (వ్యాక్సిన్‌ షాక్‌- పసిడి ధరల పతనం)

సిమెంట్‌ వీక్‌
డెరివేటివ్స్‌లో పీవీఆర్, ఆర్‌ఈసీ, కమిన్స్‌, ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌, జీఎంఆర్‌, ఐడియా, సన్‌ టీవీ, బీఈఎల్‌ డీఎల్‌ఎఫ్‌ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, టీవీఎస్‌ మోటార్, సెయిల్‌, జూబిలెండ్‌ ఫుడ్‌, అపోలో టైర్‌, ఏసీసీ, రామ్‌కో సిమెంట్‌, అంబుజా, పెట్రోనెట్‌ 6.6- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,767 లాభపడగా.. 1,200 నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు