రూపాయి పతనం, నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

7 Dec, 2022 06:46 IST|Sakshi

ముంబై: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు క్షీణించి 62,626 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 58 పాయింట్ల వెనకడుగుతో 18,643 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 445 పాయింట్లు పతనమై 62,390ను తాకగా.. నిఫ్టీ 123 పాయింట్లు నీరసించి 18,578 దిగువకు చేరింది. చమురు ధరల పెరుగుదల, గ్లోబల్‌ మార్కెట్లు బలహీనపడటం, రూపాయి పతనం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. 

ఐటీ వీక్‌..: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ 1.5 శాతం నష్టపోగా.. మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్‌ రెడ్డీస్, యూపీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్, ఐషర్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్‌ 3–1.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో అదానీ, హెచ్‌యూఎల్, నెస్లే, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ 2.5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి.  

చిన్న షేర్లు సైతం..: మార్కెట్ల బాటలో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,936 నష్టపోగా.. 1,563 పుంజుకున్నాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 635 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 559 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. సోమవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

స్టాక్‌ హైలైట్స్‌ 

రానున్న ఐదేళ్లలో అమ్మకాలను మూడు రెట్లు పెంచుకునే ప్రణాళికలు ప్రకటించడంతో వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌వరల్డ్‌ షేరు 6 శాతం జంప్‌చేసింది. రూ. 782 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 815ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. 

విభిన్న సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ అంశంపై వారాంతాన సమావేశంకానున్నట్లు వెల్లడించడంతో ఆస్ట్రా మైక్రోవేవ్‌ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 322 వద్ద ముగిసింది. తొలుత రూ. 329ను సైతం దాటింది. 

ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ నుంచి రూ. 343 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టును పొందడంతో అయాన్‌ ఎక్సే్ఛంజ్‌ (ఇండియా) షేరు 2.4 శాతం బలపడి రూ. 2,975 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,988 వద్ద సరికొత్త గరిష్టాన్ని సాధించింది. 

సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై శుక్రవారం సమావేశంకానున్నట్లు పేర్కొనడంతో బజాజ్‌ కన్జూమర్‌ షేరు తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 185కు చేరింది. చివరికి 1.6 శాతం లాభంతో రూ. 178 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు