మార్కెట్‌కు ‘సుప్రీం’ జోష్

24 Mar, 2021 00:28 IST|Sakshi

మారటోరియం పొడిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నో...

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కలిసొచ్చిన కోర్టు తీర్పు 

మళ్లీ 50 వేల పైకి సెన్సెక్స్‌  

నిఫ్టీ లాభం 78 పాయింట్లు

ముంబై: రుణాల మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు స్టాక్‌ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో కేంద్రం ప్రకటించిన రుణాల మారటోరియం గడువును పెంచడానికి అత్యున్నత న్యాయస్థానం విముఖత చూపింది. అలాగే పూర్తిగా వడ్డీ మాఫీ సాధ్యం కాదని, అసలు ఈ అంశంలో కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో బ్యాంకు రుణాలు, వడ్డీకి సంబంధించి ఇన్నాళ్ళూ కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ రంగ షేర్లు రాణించడంతో ఇండెక్సులు లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,051 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,815 వద్ద ముగిసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ వారం ఆరంభం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవడంతో కరోనా కేసులు అదుపులోకి రావచ్చని ఆశాభావం ట్రేడర్లలో నెలకొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడున్నర తగ్గడం, దేశీయంగా బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియల్టీ షేర్లకు సైతం స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది.

మరోవైపు మెటల్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 603 పాయింట్ల పరిధిలో కదలాడగా, నిఫ్టీ 171 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.108 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు సైతం రూ. 529 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌ ఎదుట యూఎస్‌ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ)ఇచ్చేందుకు ఫెడరల్‌ ౖచైర్మన్‌ పావెల్‌తో పాటు ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ ఎలెన్‌ సిద్ధమైన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. ‘‘మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఇన్వెస్టర్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని నాణ్యమైన షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఎంఎండీఆర్‌ చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సిమెంట్‌ షేర్ల ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. ప్రభుత్వం నుంచి సబ్సీడి నిధులు విడుదల కావడంతో ఫెర్టిలైజర్‌ షేర్లకు డిమాండ్‌ లభించింది’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు. 

603 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్‌...   
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్‌ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంతో 49,876 వద్ద, నిïఫ్టీ 24 పాయింట్ల పెరుగుదలతో 14,768 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 49,662 వద్ద, నిఫ్టీ 14,707 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. నష్టాల్లో కదలాడుతున్న సూచీలకు సుప్రీం తీర్పు ఉత్సాహాన్నిచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్‌ ముగింపు వరకు ర్యాలీని కొనసాగించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం (49,662) నుంచి 603 పాయింట్ల పాయింట్లు పెరిగి 50,265 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 14,879 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను నమోదుచేశాయి.

మరిన్ని వార్తలు