మూడోరోజూ ముందుకే...

5 Nov, 2020 05:29 IST|Sakshi

సెన్సెక్స్‌ లాభం 355 పాయింట్లు

11,990 పైన ముగిసిన నిఫ్టీ

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్‌ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్‌ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్‌ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెనెక్స్‌ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

617 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌....
అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్‌ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్‌ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్‌ సెషన్‌లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్‌ మార్కెట్ల పాజిటివ్‌ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి.

‘‘యూఎస్‌ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్‌ ప్రకటించడంతో యూరప్‌ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ దీపక్‌ జెసానీ తెలిపారు.  

సన్‌ఫార్మా షేరు 4 శాతం జంప్‌:  
సన్‌ఫార్మా షేరు బుధవారం బీఎస్‌ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది.

నవంబర్‌ 14న దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌
దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్‌ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తామని స్టాక్‌ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్‌ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్‌ 17న ప్రారంభమవుతాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు