నాలుగు నెలల కనిష్టానికి సూచీలు

1 Mar, 2023 00:30 IST|Sakshi

ఎనిమిదో రోజూ అమ్మకాలే

59 వేల దిగువకు సెన్సెక్స్‌

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్‌ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్‌ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.

చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్‌ అండ్‌ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు