లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. ఊపిరి పీల్చుకున్న మదుపరులు

29 Nov, 2021 16:04 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగియడంతో లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. ఆ భయాలు ఇంకా వెంటడం, కరోనా కొత్త వేరియంట్‌ విజృంభనతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత్తి కారణంగా సూచీలు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కేవలం అరగంటలోపే సూచీలు ఆ నష్టాల నుంచి బయటకు వచ్చేశాయి. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలు, మరోవైపు దీర్ఘకాలంలో భారత మార్కెట్లపై మదుపర్లు బుల్లిష్‌గా ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వల్ల కొనుగోళ్ల తాకిడి పెరిగింది.

టెలికామ్ కంపెనీలు టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధర తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు దన్నుగా నిలవడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 153.43 పాయింట్లు (0.27%) పెరిగి 57,260.58 వద్ద ఉంటే, నిఫ్టీ 27.50 పాయింట్లు (0.16%) పెరిగి 17,054.00 వద్ద నిలిచాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.09 వద్ద ఉంది. నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో ఎక్కువ లాభాలను పొందితే.. బీపీసీఎల్, సన్ ఫార్మా, యుపీఎల్, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా నష్ట పోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. 

(చదవండి: మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా కారులో అదిరిపోయే ఫీచర్స్!)

మరిన్ని వార్తలు