దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్​ పంజా

31 Mar, 2021 17:36 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ ‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ కావడంతో మదుపర్లు ఆచుతూచి వ్యవరించారు. కొవిడ్‌-19 టీకా వచ్చినప్పటికీ ప్రస్తుత ఏడాదిలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల ఉత్పత్తి 2019 స్థాయి కంటే తక్కువగానే ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొనడం, భారత్‌లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో ఉందని మూడీస్‌ అనలిటిక్స్‌ తెలపడంతో నేడు మార్కెట్లు నేలచూపులు చూశాయి.

ఉదయం 50,049 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌‌ 49,442 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 627 పాయింట్లు నష్టపోయి 49,509 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా నష్టాలతో ముగిసింది. ఉదయం 14,811 వద్ద ప్రారంభమైన నిఫ్టీ రోజులో 14,813 - 14,670 మధ్య కదలాడి చివరకు 154 పాయింట్ల నష్టంతో 14,690 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద నిలిచింది. నిఫ్టీలో స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు లాభపడితే ఆర్థిక, బ్యాంకింగ్‌, టెలికాం, విద్యుత్తు, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి.

చదవండి:

భారత్‌లో తీవ్రంగా ధరల పెరుగుదల: మూడీస్‌

మరిన్ని వార్తలు