Nifty: కొత్త శిఖరంపై నిఫ్టీ

15 Sep, 2021 04:50 IST|Sakshi

సూచీలకు పరిమిత లాభాలు 

69 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 

మార్కెట్‌కు టోకు ద్రవ్యోల్బణ ఆందోళనలు 

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు 

మెటల్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు 

ముంబై: గరిష్టస్థాయిల వద్ద స్టాక్‌ మార్కెట్‌ స్థిరీకరణ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజూ తీవ్ర ఒడిదుడుకులకు లోనై సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 306 పాయింట్లు పెరిగింది. అయితే ఆరంభ లాభాల్ని కోల్పోయి చివరికి 69 పాయింట్ల పరిమిత లాభంతో 58,247 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 17,439 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి 25 పాయింట్లు లాభంతో 17,380 వద్ద స్థిరపడింది.

ఈ ముగింపు కూడా నిఫ్టీకి సరికొత్త గరిష్టస్థాయి. ఐటీ, బ్యాంకింగ్, మౌలిక రంగాల షేర్లు రాణించాయి. మెటల్, ఆర్థిక షేర్లు నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,650 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.310 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ ఫ్లాట్‌గా 73.68 వద్ద స్థిరపడింది. అమెరికా ఆగస్టు ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(మంగళవారం రాత్రి)కి ముందు అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.   

ఆరంభ లాభాలు ఆవిరి...  
ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 305 పాయింట్ల పెరిగి 58,483 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 17,420 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో మెటల్, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు రాణించడంతో నిఫ్టీ 89 పాయింట్లు ఎగసి 17,439 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలకు పాల్పడటంతో సూచీల ఆరంభ లాభాలు అవిరై అక్కడక్కడే ముగిశాయి.

లాభాలను పంచిన లిస్టింగులు... 
అమీ ఆర్గానిక్స్‌ షేర్లు ఇష్యూ ధర రూ.610తో పోలిస్తే బీఎస్‌ఈలో 48 శాతం ప్రీమియంతో రూ.902 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.841 – రూ.967 పరిధిలో ట్రేడైంది. చివరికి 53 శాతం లాభంతో రూ.935 వద్ద స్థిరపడింది.

విజయా డయాగ్నోస్టిక్‌ షేరు ఇష్యూ ధర (రూ.531)తో పోలిస్తే 2% లాభంతో రూ.542 వద్ద లిస్టయింది. పరిమిత లాభంతో లిస్ట్‌ అయినప్పటికీ... షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఒక దశలో 23% ర్యాలీ చేసింది. చివరికి 17% లాభంతో రూ. 619 వద్ద ముగిసింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు
ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ గోయెంకాను బోర్డు నుంచి తొలగించాలంటూ రెండు విదేశీ పెట్టుబడి సంస్థలు కోరడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఇంట్రాడేలో ఏకంగా 45% దూసుకెళ్లి రూ.271 స్థాయిని అందుకుంది. చివరికి 40 శాతం లాభంతో రూ.261 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్‌నకు చెందిన జీ లెర్న్‌ షేరు 20 శాతం, జీ మీడియా కార్పొరేషన్‌ షేరు ఐదుశాతం లాభపడ్డాయి. 

ఐఆర్‌సీటీసీ షేరు ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా మంగళవారం ఇంట్రాడేలో తొమ్మిదిన్నర శాతం పెరిగి రూ.3760 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 9% లాభంతో రూ.3737 వద్ద ముగిసింది.  

హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు  ఇంట్రాడేలో 3% లాభపడి రూ.1,241 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి రెండున్నర శాతం  రూ.1239 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు