క్రిస్మస్‌ తర్వాత శాంటాక్లాజ్‌ ర్యాలీ 

27 Dec, 2022 06:56 IST|Sakshi

ముంబై: క్రిస్మస్‌ పండుగ తర్వాత రోజు స్టాక్‌ మార్కెట్లో శాంటాక్లాజ్‌ ర్యాలీ కనిపించింది. కోవిడ్‌ భయాలతో గతవారం అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలను ఆర్జించింది. ఇటీవల మార్కెట్‌ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు డిమాండ్‌ లభించింది. అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు ట్రేడింగ్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.

ఉదయం సెన్సెక్స్‌ 90 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,845 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల పతనంతో 17,830 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,834 వద్ద, నిఫ్టీ 277 పాయింట్లు బలపడి 18,084 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఆఖర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి సెన్సెక్స్‌ 721 పాయింట్ల లాభంతో 60,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు పెరిగి 18,015 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో ఐదు మాత్రమే నష్టపోయాయి.

దీంతో స్టాక్‌ సూచీల నాలుగురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయిలో మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 3.13%, 2.31 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.498 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1286 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా అరశాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్‌ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు బలపడి 82.65 స్థాయి వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఒకశాతానికి పైగా ర్యాలీ చేయడంతో స్టాక్‌ మార్కెట్లో రూ. 5.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.277.91 లక్షల కోట్లకు చేరింది.

రాయ్‌ దంపతులు ఎన్‌డీటీవీలోని తమ వాటాను అదానీకి విక్రయించనుండటంతో 5% బలపడి రూ. 358 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ఎన్‌డీటీవీ, చివరికి 1% లాభంతో రూ.343 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు