సెన్సెక్స్‌ మైనస్‌.. నిఫ్టీ ఫ్లస్‌..!

3 Dec, 2020 00:44 IST|Sakshi

ముంబై: రికార్డు ర్యాలీతో దూసుకెళ్తున్న సూచీలకు బుధవారం చిన్న బ్రేక్‌ పడింది. ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైన సూచీలు... చివరి గంట కొనుగోళ్లతో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 37 పాయింట్ల నష్టంతో 44,618 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 13,114 వద్ద నిలిచి తన ముగింపు రికార్డును నిలుపుకుంది. ఆర్థిక రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది.

అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్, రూపాయి 13 పైసల క్షీణత మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 560 పాయింట్ల రేంజ్‌లో 44,730 – 44,170 మధ్య కదలాడింది. నిఫ్టీ 145 శ్రేణిలో 13,129–12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,636 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.

భారీ నష్టాల నుంచి రికవరీ...: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో మన మార్కెట్‌ స్వల్ప నష్టంతో మొదలైంది. ప్రారంభం నుంచే అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగ షేర్ల పతనంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 44,170, నిఫ్టీ 12,984 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

ఆటో షేర్ల ర్యాలీ...: పండుగ సీజన్‌ కలిసిరావడంతో నవంబర్‌లో వాహన విక్రయాల జోరు  కారణంగా బుధవారం ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, ఆశోక్‌ లేలాండ్‌ షేర్లు 1–3 శాతం స్థాయిలో లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు