రంకెలేస్తున్న బుల్..దలాల్‌ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత

29 Nov, 2022 07:13 IST|Sakshi

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత మోగింది. స్టాక్‌ సూచీలు సోమవారం సరికొత్త శిఖరాలకు చేరి కొత్త రికార్డు నెలకొల్పాయి. వరుసగా అయిదోరోజూ లాభాలు కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడం కలిసొచ్చింది. భవిష్యత్తుల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుదల నెమ్మదించవచ్చనే అంచనాలు బుల్స్‌కు బలాన్నిచ్చాయి.

డాలర్‌ ఇండెక్స్‌ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక వెయిటేజీ రిలయన్స్‌ షేరు నాలుగుశాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. 

ఇంధన, ఆటో, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ లభించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. సెన్సెక్స్‌ తాజా జీవిత గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిని లిఖించింది. అయితే గరిష్టాల స్థాయి వద్ద లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గి ముగిశాయి. మెటల్, టెలికం, ఐటీ, టెక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చైనాలో కోవిడ్‌ లాక్‌డౌన్‌ విధింపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

నష్టాల్లోంచి రికార్డు స్థాయిలకి...  
సెన్సెక్స్‌ ఉదయం 278 పాయింట్ల నష్టంతో 62,016 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 18,431 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలోనే నష్టాల్లోంచి తేరుకున్న సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదిలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 407 పాయింట్లు దూసుకెళ్లి 62,701 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు బలపడి 18,614 వద్ద కొత్త ఆల్‌టైం హై స్థాయిని తాకింది. దీంతో గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 జీవితకాల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆఖరి గంటలో లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 211 పాయింట్ల లాభంతో 62,505 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 18,563 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు స్థాయిలు కూడా రికార్డు గరిష్టాలు కావడం విశేషం.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
►గతేడాది(2021) అక్టోబరు 19న నమోదైన 18,604 ఆల్‌టైం హై స్థాయిని అధిగమించేందుకు నిఫ్టీకి 275 ట్రేడింగ్‌ సెషన్ల సమయం పట్టింది. అలాగే ఈ ఏడాది(2022) జూన్‌ 17న ఏడాది కనిష్ట స్థాయి(15,183) నుంచి 22% ర్యాలీ చేసింది. 

►క్రూడాయిల్‌ ధరల పతనం రిలయన్స్‌కు కలిసొచ్చింది. బీఎస్‌ఈలో నాలుగుశాతం లాభపడి రూ.2,722 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి మూడున్నర శాతం లాభంతో రూ.2,708 వద్ద స్థిరపడింది.  

మరిన్ని వార్తలు