మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్‌

21 Jan, 2021 04:25 IST|Sakshi

రెండోరోజూ కొనసాగిన సూచీల జోరు 

14,645 వద్ద ముగిసిన నిఫ్టీ 

394 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 

అన్ని రంగాలకు కొనుగోళ్ల మద్దతు 

కలిసొచ్చిన రూపాయి వరుస ర్యాలీ  

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్‌–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్‌ యెల్లన్‌ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి.

ఫలితంగా సెన్సెక్స్‌ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్‌ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.

మార్కెట్లో మరిన్ని విశేషాలు...
► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్‌ షేరు 18% లాభపడగా, ఎంఆర్‌ఎఫ్‌ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.  
► భారత్‌లో తయారయ్యే తన ఎస్‌యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్‌ ఉత్పత్తితో పాటు ఎగుమతులను  ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది.  
► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు