ఆరో రోజూ లాభాలే..!

19 Dec, 2020 05:58 IST|Sakshi

ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్వల్ప లాభాల ముగింపు

సూచీలను ఆదుకున్న ఐటీ షేర్ల ర్యాలీ

ఇంట్రాడేలో 47000 స్థాయికి సెన్సెక్స్‌ 

13,750పైన నిఫ్టీ ముగింపు

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి అరగంటలో నెలకొన్న కొనుగోళ్లు సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 46,961 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా ఆరురోజూ లాభాల ముగింపు.  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 396 పాయింట్ల రేంజ్‌ లో కదలాడింది. నిఫ్టీ 114 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది.

నగదు విభాగంలో ఎఫ్‌ఐఐలు రూ.2,720 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐ) రూ.2,424 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 862 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకు ఇది ఏడోవారమూ లాభాల ముగింపు కావడం విశేషం.  స్టాక్‌ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీలను నడిపిస్తున్నాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ బినోద్‌ మోదీ తెలిపారు. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అభివృద్ధి వార్తలు, బ్రెగ్జిట్‌ పురోగతి, అమెరిక ఉద్దీపన ఆశలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌ఐఐలు ఆసక్తి చూపుతున్నారని బినోద్‌ పేర్కొన్నారు.

ఇంట్రాడేలో 47,000 స్థాయికి సెన్సెక్స్‌...
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ తొలిసారిగా 47,000 పైన, నిఫ్టీ 13,750 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఉదయం సెషన్‌లో అనూహ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 260 పాయింట్లు  నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయాయి.  

ఆదుకున్న ఐటీ షేర్లు...  
ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్‌ నవంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో దేశీయ లిస్టెడ్‌ ఐటీ కంపెనీ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2% ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు