చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు

15 Oct, 2020 05:50 IST|Sakshi

పదోరోజూ లాభాలే

ఆదుకున్న బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ ఆగడం లేదు. చివరి గంటలో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్ల కొనుగోళ్లతో వరుసగా పదోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 40,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లను ఆర్జించి 11,971 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఐటీ, ఫార్మా, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ పది ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 3031 పాయింట్లు(7.43%), నిఫ్టీ 798 పాయింట్లు (6.67%) లాభపడ్డాయి. 2015 జనవరి తర్వాత సూచీలు వరుసగా 10 రోజుల ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. బుధవారం ఎఫ్‌ఐఐలు రూ.882 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1,276 కోట్ల షేర్లను విక్రయించారు.

నష్టాలతో మొదలై...
ఆసియా మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఆయా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో  సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం సెషన్‌లో ఐటీ, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ సాగే కొద్దీ విక్రయాల పరంపర మరింత కొనసాగడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 346 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయాయి 11,822 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.  

విప్రో షేరు 7 శాతం క్రాష్‌...
ఐటీ సేవల దిగ్గజం విప్రో షేరు బుధవారం 7 శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ సెప్టెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. అలాగే రూ.9,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ప్రణాళిక కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ట్రేడింగ్‌ ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన ఈ షేరు 7% నష్టంతో రూ.350 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ రూ.14,610 విలువైన మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది.  

‘‘ఊహించిన విధంగానే మార్కెట్‌ రీబౌండ్‌ జరిగింది. మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో పాటు కంపెనీల ఆర్థిక ఫలితాలను క్షుణ్ణంగా గమనించాలి. సూచీలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తత వహించాల్సి అవసరం ఉంది’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ సంస్థ అజిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఐపీవోకి ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఈఎస్‌ఎఫ్‌బీ) తాజాగా పబ్లిక్‌ ఇష్యూ(ఐపీవో)కి రానుంది. ఇందుకు సంబంధించి రెడ్‌ హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ను (ఆర్‌హెచ్‌పీ) అక్టోబర్‌ 11న చెన్నైలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ)కి సమర్పించింది. ఐపీవోద్వారా సుమారు రూ. 280 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఐపీవో ప్రతిపాదన ప్రకారం ప్రమోటర్‌ సంస్థ ఈహెచ్‌ఎల్‌ 7.2 కోట్ల దాకా షేర్లను విక్రయించనుంది. ఇష్యూ అక్టోబర్‌ 20న ప్రారంభమై 22న ముగుస్తుంది.  బుధవారం ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 51.70 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు