100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్‌

31 Jul, 2020 09:34 IST|Sakshi

11100 మార్కును కోల్పోయిన నిఫ్టీ 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో భారీ అమ్మకాలు 

సూచీలకు ఐటీ అండగా ఐటీ షేర్ల ర్యాలీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లను కోల్పోయి 37636 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లను నష్టపోయి 11100 దిగువున 11082 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, రియల్టీ, మీడియా, మెటల్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.80శాతం క్షీణించి 21,472 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 
ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఐఓసీలతో సహా 576 కంపెనీలు నేడు క్యూ1 ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. నేడు సుప్రీం కోర్టులో బీఎస్‌-IV వాహన కేసు విచారణకు రానుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోంది. 

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు:
కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మైనస్‌ 32.9శాతం క్షీణించింది. 1947 తర్వాత అమెరికా జీడీపీ ఈస్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. దీంతో గురువారం రాత్రి అక్కడి ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ ఇండెక్స్‌ 1శాతం నుంచి అరశాతం నష్టాన్ని చవిచూశాయి. అయితే టెక్‌ దిగ్గజాలైన ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఆల్ఫాబెక్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్లను మెప్పించడంతో​నాస్‌డాక్‌ ఇండెక్స్‌ మాత్రం అరశాతం లాభంతో ముగిసింది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు 2.7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. నేడు ఆసియాలో ఒక్క ఇండోనేషియలో తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన సూచీలు నష్టాలను చవిచూశాయి. అత్యధికంగా సింగపూర్‌, జపాన్‌ దేశాల ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం క్షీణించాయి. అలాగే చైనా, తైవాన్‌, థాయిలాండ్‌, కొరియా దేశాల స్టాక్‌ సూచీలు 0.10శాతం నుంచి అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

హీరోమోటోకార్ప్‌, టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల 1శాతం 2.50శాతం నష్టపోయాయి. బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1.50శాతం 2శాతం లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు