ఒడిదుడుకుల ట్రేడింగ్‌.. నష్టాల ముగింపు

29 Jul, 2021 01:42 IST|Sakshi

ఫెడ్‌ పాలసీ ప్రకటనకు ముందు అప్రమత్తత

ఐఎంఎఫ్‌ వృద్ధి రేటు తగ్గింపు

ప్రతికూలతలు కొనసాగుతున్న చైనా టెక్‌ షేర్ల పతన భయాలు

ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు

135 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

నిఫ్టీ నష్టం 37 పాయింట్లు

మూడు సెషన్లలో రూ. లక్ష కోట్ల సంపద ఆవిరి

ముంబై: ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు, ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ ప్రకటనకు ముందురోజు దేశీయ స్టాక్‌ సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 871 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 135 పాయింట్లు నష్టపోయి 52,444 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 254 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్‌ ముగిసే సరికి 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద నిలిచింది.  చైనాలోని టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ మరింత తగ్గించింది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ ప్రకటన(బుధవారం రాత్రి), జూలై ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు (గురువారం)నకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. ఈ ప్రతికూలతలతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 776 పాయింట్లు నష్టపోయి 52 వేల దిగువన 51,803 స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం 233 పాయింట్లను నష్టపోయి 15,513 స్థాయికి దిగివచ్చింది. అయితే యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో సూచీలకు నష్టాల అడ్డుకట్ట పడింది.

మిడ్‌సెషన్‌ నుంచి క్రమంగా కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ నష్టాల ముగింపు తప్పలేదు. మార్కెట్‌ మూడురోజుల పతనంతో ఇన్వెస్టర్లు రూ.లక్ష కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.235.11 లక్షల కోట్లకు దిగివచ్చింది.  ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటించిన బ్యాంక్స్, ఫైనాన్స్‌ కంపెనీల ఆస్తుల నాణ్యత క్షీణించడంతో ఆ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంరపర కొనసాగిస్తూ రూ.2275 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.921 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ అయ్యింది. డాలర్‌ మారకంలో తొమ్మిది పైసలు బలపడి 74.38 వద్ద ముగిసింది.

రెండోరోజూ రాణించిన స్టీల్‌ షేర్లు...  
దేశీయ స్టీల్‌ రంగ షేర్లు రెండోరోజూ రాణించాయి. తమ దేశంలో నెలకొన్న స్టీల్‌ కొరత, ధరల నియంత్రణకు చైనా సిద్ధమైంది. స్టీల్‌ ఎగుమతులపై సుంకాలను 10–25% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ టారిఫ్‌లు అమలయితే చైనా నుంచి స్టీల్‌ దిగుమతులు తగ్గి దేశీయ స్టీల్‌కు డిమాండ్‌ పెరగవచ్చనే అంచనాలతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్, మెయిల్, ఏపీఎల్‌ అపోలో, వేదాంత షేర్లు లాభపడ్డాయి. స్టీల్‌ షేర్లు రాణించడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం లాభపడింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► నష్టాల మార్కెట్లో ఎయిర్‌టెల్‌ షేరు ఎదురీదింది. కంపెనీ తన  ప్రారంభ స్థాయి ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరను 60% మేర పెంచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో ఐదున్నర శాతం పెరిగి రూ.570 స్థాయిని తాకిన షేరు చివరికి ఐదుశాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది.
► రామ్‌కో సిమెంట్స్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఈ కంపెనీకి ‘‘అండర్‌పర్‌ఫామ్‌’’ రేటింగ్‌ను కేటాయించాయి. ఫలితంగా కంపెనీ షేరు రెండుశాతం నష్టపోయి రూ.1,041 వద్ద ముగిసింది.
► ఇదే క్యూ1 కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించిన సెంచురీ టెక్స్‌టైల్స్‌ కంపెనీ షేరు ఇంట్రాడేలో 20% ర్యాలీ చేసి రూ.819 స్థాయికి తాకింది. చివరికి 17% లాభంతో రూ.796 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు